డేట్ & టైమ్ చెప్పండి..కేటీఆర్ ఏపీ మొత్తం తిప్పి చూపిస్తాం అంటూ మంత్రి కేటీఆర్ కు ఏపీ మంత్రి రోజా కౌంటర్ వేశారు. ఏపీలోని పరిస్థితుల ఫై కేటీఆర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు రెండు రాష్ట్రాల నేతల మధ్య మాటల యుద్దానికి దారి తీసింది. హెచ్ఐసీసీలో జరిగిన ప్రాపర్టీ షో ప్రారంభోత్సవంలో ఏపీలో పరిస్థితులపై కేటీఆర్ కామెంట్స్ చేసారు. ఏపీలో కరెంట్ లేదని.. నీళ్ళు లేవని.. రోడ్లు ధ్వంసం అయ్యాయన్నారు.అక్కడి పరిస్థితి అధ్వాన్నంగా ఉందన్నారు. తన మిత్రుడు ఊరినుంచి తిరిగి హైదరాబాద్ వచ్చాక ఊపిరి పీల్చుకున్నట్లు ఉందని చెప్పాడన్నారు. ఈ కామెంట్స్ ఫై వైసీపీ నేతలు వరుసపెట్టి కౌంటర్లు వేస్తున్నారు.
ఈ క్రమంలో కేటీఆర్ కామెంట్స్ ఫై మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆయన ఫ్రెండ్ చెప్పిన విషయాలు చాలా తప్పని, ఒక టూరిస్టు మినిస్టర్ గా తాను దగ్గరుండి మంత్రి కేటీఆర్ ను ఏపీ మొత్తం తిప్పి చూపిస్తానన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు రావాలని కేటీఆర్‌ను ఆహ్వానిస్తున్నా.. కేటీఆర్ ఏపీకి వచ్చి చూసిన తర్వాత మాట్లాడితే బాగుంటుందన్నారు. ఎవరో ఏదో చెబితే నమ్మి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఏపీలో సంక్షేమ పాలన దేశానికే ఆదర్శమన్నారు. సీఎం జగన్ పాలనలో అవినీతికి తావులేకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. 16 రాష్ట్రాల్లో కరెంటు కోతలు ఉన్నాయని మంత్రి రోజా అన్నారు.