రంజాన్ పండుగ సందర్భంగా రేపు హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రంజాన్ పర్వదినం సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రత్యేక ప్రార్థనలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రేపు ఉదయం 7 నుంచి 11:30 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మెహిదీపట్నం నుంచి బంజారాహిల్స్ రోడ్ నంబర్ 1 వైపు వచ్చే వాహనాలు అయోధ్య, ఖైరతాబాద్, ఆర్టీఏ ఆఫీస్, తాజ్‌కృష్ణా మీదుగా వెళ్లాలిని పోలీసులు సూచించారు. అలాగే, బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 నుంచి మాసబ్ ట్యాంక్ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులను తాజ్‌కృష్ణా, ఎన్‌ఎఫ్‌సీఎల్ జంక్షన్ మీదుగా మళ్లిస్తామన్నారు. లక్టీకాపూల్ నుంచి రోడ్ నంబర్ 1/12 వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు అయోధ్య, నిరంకారి, చింతల్‌బస్తీ మీదుగా వెళ్లాలని వివరించారు.
ఇక, ఈద్గా మీరాలం ట్యాంక్ వైపు ప్రార్థనల కోసం వచ్చే వాహనాలు పురానాపూల్, కిషన్ బాగ్, బహదూర్ పురా చౌరస్తా మీదుగా వెళ్లాలని అన్నారు. అలాగే, సైకిళ్లు, రిక్షాలను ఈద్గా క్రాస్ రోడ్స్ దాటి వెళ్లనివ్వబోమని పోలీసులు తెలిపారు. మరోవైపు, శివరాంపల్లి, నేషనల్ పోలీసు అకాడమీ వైపు నుంచి బహదూర్‌పురా వచ్చే వాహనాలను ధనమ్మ గుడిసెలు ఉండే టీ-జంక్షన్ నుంచి ఆలియాబాద్, తాడ్‌బండ్, బాయిస్ టౌన్ హైస్కూల్ మీదుగా మళ్లిస్తామని వివరించారు.