రాబోయే ఎన్నికల్లో టిఆర్ఎస్ – కాంగ్రెస్ పొత్తు ఖాయమన్నారు ఎంపీ ధర్మపురి అరవింద్. టిఆర్ఎస్ పార్టీ విపక్షాల అభ్యర్ధికి మద్దతు ఇవ్వడం పట్ల అరవింద్ స్పందించారు. బీజేపీ దళితుడిని రాష్ట్రపతిని చేసిందని..ఇప్పుడు ఆదివాసీ బిడ్డను రాష్ట్రపతిని చేయబోతుందని చెప్పారు. కానీ కేసీఆర్ దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి చేయలేదన్నారు. టిఆర్ఎస్ పార్టీ ఆదివాసీలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని , రాష్ట్రపతి ఎన్నికలు కాంగ్రెస్, టీఆర్ఎస్ పొత్తుకు తొలిమెట్టుగా మారాయన్నారు. అంతేకాదు కాంగ్రెస్, టిఆర్ఎస్ కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాయని అన్నారు.
తెలంగాణ సీఎం కెసిఆర్ బీఆర్ఎస్ ఎక్కడికెళ్ళిందో చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణలోని కొన్ని ప్రాంతాలలో తప్పితే, దేశవ్యాప్తంగా ప్రతి మారుమూల ప్రాంతాల్లోనూ కరెంటు ఉందని ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి భూమి కేటాయించి ఉంటే ఇప్పటికే కోచ్ ఫ్యాక్టరీ పూర్తి అయ్యేదని ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి భూమి కేటాయించలేక పోయిన వీళ్లు, విభజన హామీల గురించి మాట్లాడటం సిగ్గుచేటని ధర్మపురి అరవింద్ విమర్శించారు. ప్రధానమంత్రి, కేంద్రమంత్రులు తెలంగాణ రాష్ట్రానికి వస్తే పర్యాటకులా అంటూ ధర్మపురి అరవింద్ ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ దేశం మొత్తం తిరిగితే ఏ పర్యాటకుడునో సమాధానం చెప్పాలని ధర్మపురి అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.