ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

జగన్ సర్కార్ తీర్పు చంద్రబాబు ఆగ్రహం

టీడీపీ అధినేత , మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం జిల్లాల పర్యటన కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కుప్పంలో పర్యటిస్తున్న బాబు..జగన్ సర్కార్ ఫై నిప్పులు చెరిగారు. ఏపీలో వ్యవస్థల పతనం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని అన్నారు. ముఖ్యమంత్రి కాన్వాయ్ కోసం కనీసం కార్లు కూడా సమకూర్చుకోలేని స్థితిలో రాష్ట్రం ఉండడం అవమానకరం అన్నారు.

సీఎం, వీఐపీ కాన్వాయ్ లకు అయిన ఖర్చు రూ.17.5 కోట్లు అని, తక్షణమే చెల్లించాలంటూ రవాణశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయడం.. సీఎం పర్యటనకు కార్లు ఇచ్చిన వారికి బిల్లులు చెల్లించకపోవడం రాష్ట్ర దుస్థితికి అద్దంపడుతోందని ఆయన ఎద్దేవా చేశారు. బిల్లుల చెల్లింపులు జరపకపోతే అధికారులు కార్లు ఎలా ఏర్పాటు చేస్తారన్నారు. బిల్లులు రాక యజమానులు పడే బాధలకు ఎవరిది బాధ్యత? అని ప్రశ్నించారు. వ్యవస్థల నిర్వీర్యంతో అధికారులు, ఉద్యోగులు కూడా.. తీవ్ర ఒత్తిడికి లోనై తప్పులు చేసే పరిస్థితి వచ్చిందని తెలిపారు. అసలు ప్రభుత్వం తెచ్చిన అప్పులు.. పెండింగ్‌లో ఉన్న బిల్లుల అంశంపై వాస్తవాలు వెల్లడించగలరా? అని చంద్రబాబు ప్రశ్నించారు. ఇటువంటి ఘటనలు రాష్ట్ర బ్రాండ్ ఇమేజిని ఘోరంగా దెబ్బతీస్తాయని అభిప్రాయపడ్డారు.