ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

వైస్సార్సీపీ ఎమ్మెల్యేల‌కు గడప గడపలో ఛీత్కారాలు : నాదెండ్ల

మేనిఫెస్టోలో చెప్పిన జాబ్ క్యాలెండర్ ఏమైందని నిల‌దీత‌

జనసేన నేత నాదెండ్ల మనోహర్ సీఎం జగన్ పై మండిప‌డ్డారు. ఎన్నిక‌ల ముందు ఇచ్చిన హామీల‌ను జ‌గ‌న్ నెర‌వేర్చ‌డం లేద‌ని ఆయ‌న అన్నారు. మేనిఫెస్టోలో చెప్పిన జాబ్ క్యాలెండర్ ఏమైందని నిల‌దీశారు. మద్యపాన నిషేధం విధిస్తామ‌ని చెప్పిన జ‌గ‌న్.. ఇప్పుడు ప్ర‌తి గ్రామంలో మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అలాగే, సీపీఎస్ రద్దుపై కూడా హామీని నిలబెట్టుకోవ‌ట్లేద‌ని అన్నారు.

వైస్సార్సీపీ ఎమ్మెల్యేల‌కు ఏపీలోని ప్ర‌తి ఊరిలో గడప గడపలో ఛీత్కారాలు ఎదుర‌వుతున్నాయ‌ని ఆయ‌న ఎద్దేవా చేశారు. పరిపాలన చేతగాని సీబీఐ దత్తపుత్రుడైన‌ జగన్ రెడ్డిలో ఆందోళన మొదలైందని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.7 లక్షల చొప్పున‌ అందించాల్సిన డ‌బ్బుల‌నూ స‌ర్కారు ఇవ్వ‌ట్లేద‌ని ఆరోపించారు. నోటికొచ్చినట్లు జ‌గ‌న్ అబద్ధాలు చెబుతున్నార‌ని ఆయ‌న విమర్శించారు.