జాతీయం

కార్తీ చిదంబరం ఇళ్లు, కార్యాలయాలపై సీబీఐ సోదాలు

చైనీయులకు అక్రమంగా వీసాలు ఇప్పించారన్న ఆరోపణలు

కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం, ఇళ్లు, కార్యాలయాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ సోదాలకు దిగింది. ముంబై, చెన్నై, ఒడిశా, పంజాబ్, కర్ణాటక రాష్ట్రాల్లో ఆయనకు చెందిన వసతుల్లో తనిఖీలు చేపట్టింది. పంజాబ్ లోని ఓ ప్రాజెక్టులో పనిచేసేందుకు వీలుగా చైనా జాతీయులకు కార్తీ చిదంబరం వీసాలు ఇప్పించాడని, ఇందుకు రూ.50 లక్షలు లంచం తీసుకున్నట్టు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.

దీనిపై కార్తీ చిదంబరం స్పందించారు. ‘‘లెక్కపెట్టలేకపోతున్నాను.. ఎన్ని సార్లు ఇలా.. ఇదొక రికార్డు’’ అంటూ కార్తీ చిదంబరం ట్వీట్ చేశారు. 2010-2014 మధ్య విదేశాల నుంచి కార్తీ చిదంబరం ఖాతాలకు నగదు బదిలీలు జరిగినట్టు సీబీఐ తాజాగా కేసు నమోదు చేసింది. గతంలో ప్రాథమిక విచారణ మాత్రమే చేయగా, ఇప్పుడు దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, సోదాలు నిర్వహించినట్టు ఈ వ్యవహారం తెలిసిన వర్గాలు వెల్లడించాయి.