వెంటనే డ్రోన్‌ను కూల్చేశామని బీఎస్ఎఫ్ ప్రకటన
నాలుగు కిలోల నిషేధిత వస్తువుల గుర్తింపు
పాకిస్థాన్ మరోసారి దుందుడుకు చర్యలకు పాల్పడింది. పంజాబ్, ఫిరోజ్ పూర్ సెక్టార్లోని సరిహద్దులో ఈ రోజు తెల్లవారుజామున ఓ పాకిస్థాన్ డ్రోన్ చక్కర్లు కొడుతూ కలకలం రేపింది. దాన్ని గుర్తించిన బీఎస్ఎఫ్ సిబ్బంది వెంటనే డ్రోన్‌ను కూల్చేశారు. అందులో నాలుగు కిలోల నిషేధిత వస్తువులు ఉన్నట్లు తెలిపారు.
ఆ డ్రోన్ కు ఆకుపచ్చ సంచి ఒకటి ఉందని, అది గాల్లో ఉన్న సమయంలోనే గుర్తించామని వివరించారు. ఆ చిన్న సంచిలో పసువు రంగులో నాలుగు ప్యాకెట్లు ఉన్నాయని తెలిపారు. అంతేగాక, మరో నలుపు ప్యాకెట్ కూడా ఉన్నట్లు తెలిపారు.
మరోవైపు, జమ్మూకశ్మీర్లోని అవంతిపొరలోనూ అలజడి చెలరేగింది. ఆ ప్రాంతంలో జైషే మహ్మద్ కు చెందిన నలుగురు ఉగ్రవాద సానుభూతిపరులను భద్రతా బలగాలు అరెస్ట్ చేశాయి. వారు నలుగురు ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్నారని, ఆయుధాల తరలింపులోనూ సహకరించినట్లు గుర్తించామని వివరించారు.