కేరళలోని కొచ్చి తీరంలో అరేబియా సముద్ర గర్భంలో ఓ దీవిలాంటి నిర్మాణం ఆశ్చర్యపరుస్తోంది. గూగుల్ మ్యాప్స్ బయటపెట్టిన ఈ మిస్టరీ ఐలాండ్‌పై ఇప్పుడు మరిన్ని పరిశోధనలు జరగనున్నాయి. నిపుణులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న ఈ నిర్మాణం ఏంటి? అసలు ఎలా ఏర్పడిందన్నది తేలాల్సి ఉంది. దీనిపై కేరళ యూనివర్సిటీ ఆఫ్ ఫిషరీస్ అండ్ ఓషియన్ స్టడీస్ (కుఫోస్) ఈ నిర్మాణంపై పరిశోధనకు సిద్ధమవుతోంది.
ఎలా తెలిసింది?
చెల్లనమ్ కర్షిక టూరిజం డెవలప్‌మెంట్ సొసైటీ అనే సంస్థ దీనిని తొలిసారి గుర్తించింది. ఈ నెల మొదట్లోనే తమ ఫేస్‌బుక్ పేజీలో ఈ నిర్మాణం గురించి వెల్లడించింది. అరేబియా సముద్రంలో ఓ దీవిలాంటి నిర్మాణం కనిపిస్తున్నట్లుగా గూగుల్ మ్యాప్స్ చూపిస్తోందని ఈ సంస్థ అధ్యక్షుడు కేఎక్స్ జూలప్పన్ చెప్పారు. కొచ్చి తీరానికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఇది ఉన్నట్లు గుర్తించారు.
8 కి.మీ. పొడవు, 3.5 కి.మీ. వెడల్పులో ఈ నిర్మాణం ఏర్పడినట్లు ఈ సంస్థ చెప్పింది. ఇదేంటో గుర్తించాలంటూ చెల్లనమ్ సంస్థ సదరు యూనివర్సిటీకి లేఖ రాసింది. దీనిపై యూనివర్సిటీ వీసీ రిజి జాన్ స్పందించారు. ఇదేంటో గుర్తించే పనిలో ఉన్నట్లు తెఇపారు. గూగుల్ మ్యాప్స్ చూస్తుంటే ఇది నీటి లోపల ఉన్న దీవిలా కనిపిస్తోంది. సాధారణంగా ఇలాంటివి ప్రపంచవ్యాప్తంగా ఉంటాయి. అయితే దీనికి ప్రత్యేకంగా ఓ ఆకారం కూడా ఉంది. అయితే ఇది ఎలా ఏర్పడింది అన్నది మాకు తెలియదు. పరిశోధన జరిపితేనే అది తెలుస్తుంది. ఆ తర్వాతే ఏదైనా చెప్పగలం అని రిజి జాన్ అన్నారు.
ఎలా ఏర్పడింది?
స్థానిక మత్య్సకారులు ఇది కొచ్చి పోర్టులో చేస్తున్న డ్రెడ్జింగ్ కారణంగా ఏర్పడిన నిర్మాణం కావచ్చని అనుమానం వ్యక్తం చేసినట్లు రిజి జాన్ వెల్లడించారు. ఈ అంశాన్నీ తాము పరిశీలిస్తామని చెప్పారు. అయితే ఇవి సాధారణంగా నీటి అడుగున ప్రవాహం, అక్రెషన్ (తీర అవక్షేపం తిరిగి ఒడ్డుకు రావడం), తీరంం కోతకు గురి కావడం వల్ల ఏర్పడుతుంటాయని ఆయన తెలిపారు. నిజానికి కేరళ దక్షిణ ప్రాంతంలో ఈ తీరం కోతకు గురి కావడమనే సమస్య ఉంది.
ఈ నిర్మాణాన్ని తాము గత నాలుగేళ్లుగా చూస్తూనే ఉన్నామని చెల్లనమ్ కర్షిక టూరిజం డెవలప్‌మెంట్ సొసైటీ చెబుతోంది. అయితే దాని పరిమాణంలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదని చెప్పింది. ఎర్నాకుళం జిల్లాలోని తీరప్రాంత గ్రామమైన చెల్లనమ్‌లో 2017 నుంచి తీరం కోతకు గురవుతూనే ఉంది. ఇప్పుడీ నిర్మాణంపై కేరళ ప్రభుత్వ ఆదేశాల మేరకు సదరు యూనివర్సిటీ ఓ ప్రాజెక్టును రూపొందిస్తోంది.