జాతీయం ముఖ్యాంశాలు

దేశంలో కొత్తగా 62,480 కరోనా కేసులు

దేశంలో కరోనా ఉధృతి తగ్గుముఖం పడుతున్నది. గడిచిన 24 గంటల్లో దేశంలో 62,480 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వశాఖ శుక్రవారం తెలిపింది. 73 రోజుల తర్వాత కనిష్ఠానికి రోజువారీ కేసులు చేరుకున్నాయని పేర్కొంది. కొత్తగా 88,977 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారని చెప్పింది. మరో 1,587 మంది వైరస్‌ బారినపడి మృతి చెందారని తెలిపింది. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,97,62,793కు చేరింది. మొత్తం 2,85,80,647 మంది బాధితులు కోలుకున్నారు. వైరస్‌ బారినపడి ఇప్పటి వరకు 3,83,490 మంది ప్రాణాలు కోల్పోయారు.

ప్రస్తుతం దేశంలో 7,98,656 యాక్టివ్‌ కేసులున్నాయని వివరించింది. టీకా డైవ్‌లో భాగంగా ఇప్పటి వరకు 26,89,60,399 డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ చెప్పింది. వరుసగా 36వ రోజు రోజువారీ కొత్త కేసులను రికవరీలు మించిపోయాయని చెప్పింది. జాతీయ రికవరీ రేటు ప్రస్తుతం 96.03 శాతానికి పెరిగింది. వీక్లీ పాజిటివిటీ రేటు 5 శాతాని కంటే తక్కువగా ఉందని, ప్రస్తుతం 3.80 శాతంగా ఉందని తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 3.24 శాతంగా ఉందని.. వరుసగా 11వ రోజు శాతానికన్నా తక్కువగా ఉందని వివరించింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 38.71 కోట్ల నమూనాలను పరిశీలించినట్లు ఐసీఎంఆర్‌ తెలిపింది.