ప్రొఫెసర్ జయశంకర్ స్వగ్రామం నుంచే టీఆర్ఎస్ పతనమన్న రేవంత్
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ (టీపీసీసీ) ఆధ్వర్యంలో రైతు రచ్చబండ కార్యక్రమం శనివారం ప్రారంభమైంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన దివంగత ప్రొఫెసర్ జయశంకర్ స్వగ్రామం అక్కంపేట నుంచి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లో పార్టీ ఇంచార్జీలు కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అక్కంపేటలో రైతు రచ్చబండను ప్రారంభించిన సందర్భంగా రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సొంత రాష్ట్ర కాంక్షకు ఉద్యమ ఊపిరిలూదిన ప్రొఫెసర్ జయశంకర్ స్వగ్రామం అక్కంపేట నుంచే టీఆర్ఎస్ పతనం కోసం రైతులతో కలిసి కదులుతున్నానని ఆయన పేర్కొన్నారు. రైతులే తన సైన్యమని, వారి జీవితాల్లో వెలుగులే తన గమ్యమని రేవంత్ ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి.. గ్రామంలోని దళిత వాడలో పర్యటించారు. ఈ సందర్భంగా దళిత వాడలోనే ఆయన సహపంక్తి భోజనం చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా మారి 8 ఏళ్లు అవుతున్నా… రాష్ట్రంలో దళితుల బతుకులు ఇంకా బాగుపడలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.