తెలంగాణ

జాతీయ రాజకీయాలు, దేశ ప‌రిస్థితులపై చ‌ర్చ‌

ఢిల్లీలో అఖిలేశ్ యాద‌వ్‌తో సీఎం కేసీఆర్ స‌మావేశం

సీఎం కేసీఆర్ దేశ వ్యాప్త పర్యటనలో ఉన్న విష‌యం తెలిసిందే. ఈ క్రమంలో ఆయ‌న ఢిల్లీలో ప‌లువురు కీల‌క నేత‌ల‌తో స‌మావేశం అవుతున్నారు. ఇందులో భాగంగా ఆయ‌న‌ సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌తో సమావేశమయ్యారు. కేసీఆర్‌ నివాసంలో ఈ భేటీ కొన‌సాగుతోంది. జాతీయ రాజకీయాలు, దేశ ప‌రిస్థితులు, ప్రాంతీయ పార్టీల బ‌లాలు, దేశంలో ప్రత్యామ్నాయ ఎజెండా రూపకల్పన వంటి అంశాల‌పై వారు చ‌ర్చిస్తున్నారు. గ‌త‌ ఉత్తరప్రదేశ్ ఎన్నికల అనంత‌రం చోటు చేసుకున్న ప‌రిణామాల‌పై కూడా చ‌ర్చిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

ఇక ఈ రోజు సాయంత్రం ఢిల్లీలోని మొహల్లా క్లినిక్ ను కూడా కేసీఆర్ సందర్శించనున్నట్లు తెలుస్తోంది. రేపు మధ్యాహ్నం కేసీఆర్ ఢిల్లీ నుంచి చండీగఢ్ కు వెళ్తారు. జాతీయ రైతు ఉద్యమంలో మృతి చెందిన రైతుల‌ కుటుంబాలను సీఎం కేసీఆర్ పరామర్శించి, వారికి ఆర్థిక సాయం చేస్తారు. చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్ లతో కలిసి సీఎం కేసీఆర్ పాల్గొన‌నున్న‌ట్లు తెలుస్తోంది.