ప్రపంచ దేశాలకు గోధుమలను ఎగుమతి చేయకుండా నిషేధిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని భారత్‌ను అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అభ్యర్థించింది. అంతర్జాతీయ ఆహార భద్రత, ప్రపంచ సుస్థిరతతో భారత్ కీలక పాత్ర పోషించాలని ఐఎంఎఫ్ చీఫ్ క్రిష్టాలినా జార్జియోవా మంగళవారం పేర్కొన్నారు. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన క్రిష్టాలినా జార్జియోవా ఓ ఆంగ్ల టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దాదాపు 135 కోట్ల మంది పౌరులకు ఆహార ధాన్యాలు సరఫరా చేయాల్సిన అవసరం ఉన్నందుకు భారత్‌ను అభినందిస్తున్నానని చెప్పారు.
కానీ వేడి వాతావరణం వల్ల ఆహార ధాన్యాల దిగుబడులు తగ్గాయని క్రిష్టాలినా ఆందోళన వ్యక్తం చేశారు. పలు దేశాలు ఇతర దేశాలకు గోధుమల ఎగుమతిపై నిషేధం విధిస్తున్నాయని గుర్తు చేశారు. కనుక భారత్ తన నిషేధాన్ని పునః పరిశీలించాలని భారత్‌ను అభ్యర్థిస్తున్నానని చెప్పారు. ఇప్పటికే ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం ప్రభావం నేపథ్యంలో ఈజిప్ట్, లెబనాన్ వంటి దేశాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందన్నారు. ఆహార ధాన్యాలు లేక ఆ రెండు దేశాల్లో అశాంతి నెలకొంటుందన్నారు.