ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

ఏ అవగాహనతో పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు : కొడాలి నాని

మాజీ మంత్రి కొడాలి నాని నేడు కృష్ణా జిల్లా గుడివాడ మండలం లింగవరంలో నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో కొడాలి పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిక్కర్లు వేసుకునే పిల్లలను రెచ్చ గొట్టి పవన్ కల్యాణ్ పబ్బం గడుపుతున్నారని వ్యాఖ్యానించారు. ఎవరో రాసిన స్క్రిప్టులు చదువుతూ, రాజ్యాంగంపై అవగాహన లేని సన్నాసులు రాజకీయాల్లోకి వస్తే ఇలాగే జరుగుతుందని విరుచుకుపడ్డారు. ఏ అవగాహనతో పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని అని నిలదీశారు. అంబేద్కర్‌ను వ్యతిరేకించే వాళ్లకు దేశ బహిష్కరణ విధించి జైలుకు పంపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి ప్రజల క్షేమమే ముఖ్యమని… మంత్రి , ఎమ్మెల్యే ఇల్లులు కాదన్నారు. జనసేన కార్యకర్తలందరూ నిక్కర్లు వేసుకునే బుడ్డోళ్ళంటూ మాజీ మంత్రి యెద్దేవా చేశారు.

చీకటి ఒప్పందాలు చేసుకున్న నాయకుల నుంచి తల్లిదండ్రులు తమ పిల్లలను రక్షించుకోవాలన్నారు. ప్రభుత్వం ఫైర్ ఓపెన్ చేయించి కాల్పులు జరిపితే పరిస్థితి అదుపులోనే ఉండేదని తెలిపారు. తర్వాత చంద్రబాబు అసలు పుత్రుడు, దత్త పుత్రుడు వచ్చి చనిపోయిన వారి పాడెలు మోస్తూ శవ రాజకీయాలు చేసేవారని మండిపడ్డారు. అంబేద్కర్ ఒక్కరి వ్యక్తి కాదని భారతరత్న, అందరివాడని చెప్పారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని అనుసరించి మంత్రి, ఎమ్మెల్యే ఇల్లు రక్షణపై కంటే గొడవలు ఆపి, ఎవరిని గాయపరచకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు. ప్రాణ నష్టం జరగకుండా ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించిందని కొడాలి నాని చెప్పుకొచ్చారు.