పెద్దపల్లి జిల్లాలోని రామగిరి మండలం ఓపెన్ కాస్ట్ వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. ఓపెన్ కాస్ట్ మైన్ 2 కోసం చేపట్టిన విస్తరణలో భాగంగా లద్నాపూర్ గ్రామంలోని ఇళ్లను స్వాధీనం చేసుకోవటానికి అధికారులు వారికి నష్టపరిహారం ఇస్తామని, పునరావాస ప్యాకేజీని ఇస్తామని గతంలో ప్రకటించారు. కానీ పరిహారం ఇవ్వకుండానే లద్నాపూర్ గ్రామంలోని ఇళ్ళను అధికారులు కూల్చివేశారు. దీంతో భూ నిర్వాసితులు ఆందోళన బాట పట్టారు. రామగిరి ఓపెన్ కాస్ట్ మైన్ లోకి ఆందోళనకారులు దూసుకురావడంతో పోలీసులు వారిని అడ్డగించారు .దీంతో పోలీసులకు, భూనిర్వాసితులకు మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది.
సింగరేణి అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు గని లోపలికి ప్రవేశించకుండా భూ నిర్వాసితులు అడ్డుకోవడంతో గని బయట బైఠాయించిన నిరసనకారులు ఆందోళనలు చేపట్టారు. తమకు న్యాయం జరిగే వరకు కదిలేది లేదని తేల్చి చెప్పారు. తమ ఇళ్లను కూల్చివేసి, మైనింగ్ చేయడానికి అధికారులు ప్రకటించిన పునరావాస ప్యాకేజీ అందకపోవడంతో 283 మంది భూనిర్వాసితులు ఆందోళన వ్యక్తం చేశారు. పరిహారం ఇవ్వకుండానే ఇళ్లను కూల్చివేశారు అంటూ భూ నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు పునరావాస ప్యాకేజీ అందించిన తర్వాతే మైనింగ్ చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు