ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు రాగి జావ, మొలకలు-బెల్లం అందజేయాలని నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. పిల్లల్లో పోషకాహార లోపం నివారణకు మధ్యాహ్న భోజనానికి అదనంగా 2019-20లో రాగి జావ, 2021-22లో రాగిజావ, పల్లీ పట్టి ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించగా…కేంద్రం ఆమోదించింది. అయినా అమలుచేయకుండా రాష్ట్ర విద్యాశాఖ నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఎందుకు అమలు చేయలేదని కేంద్ర విద్యాశాఖ కూడా ప్రశ్నించడం లేదు. ఈ నేపథ్యంలో ఈసారైనా పిల్లల నోటికి రాగి జావ, మొలకలు-బెల్లం అందేనా అన్న సందేహం వ్యక్తమవుతోంది.
పాఠశాలలలో విద్యార్థులకు ఉచితంగా మధ్యాహ్నం పూట భోజన సదుపాయం కలిపించే ప్రభుత్వ విధానాన్ని మధ్యాహ్న భోజన పథకము అంటారు. పేద బాల బాలికలు పేదరికం కారణంగా పాఠశాలకు వెళ్ళడం మానివేయకూడదనే ఉద్దేశంతో, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వ పథకం ఇది. ఇందులో అన్ని పని దినాలలో విద్యార్థినీ విద్యార్థులకు ఉచితంగా భోజనం పెడతారు. బాలబాలికలను ఆకలి బాధ నుంచి దూరం చేయడం, పాఠశాలలో చేరేవారి సంఖ్యను, హాజరు అయ్యేవారి సంఖ్యను పెంచడం, పిల్లల్లో సామాజిక సమ భావన పెంపొందించడం, పౌష్టికాహార లోపాన్ని తగ్గించడం, ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యాలు.