ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యాంశాలు

తెలంగాణ గవర్నర్ తమిళిసై కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్

తెలంగాణ గవర్నర్ తమిళిసై పుట్టిన రోజు ఈరోజు. ఈ సందర్బంగా సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆమెకు బెస్ట్ విషెష్ ను అందజేశారు. రాజకీయ కుటుంబంలో జన్మించి, వైద్య శాస్త్రాన్ని అభ్యసించి, వైద్య వృత్తిలో ఎన్నో విజయాలను చవిచూసిన తమిళిసై గారిని నేటి యువతులకు ఆదర్శమూర్తిగా భావిస్తున్నానని చెప్పారు. వైద్య సేవలు అందిస్తూనే, కుటుంబ నేపథ్యంగా వచ్చిన రాజకీయ రంగాన కూడా ఆమె తనదైన పాత్రను పోషిస్తూ, నేడు గౌరవప్రదమైన గవర్నర్ స్థాయికి ఎదిగారని అన్నారు. ఒక్క తెలంగాణకే కాకుండా పుదుచ్చేరికి కూడా ఇంఛార్జి గవర్నర్ గా నియమితులవ్వడం ఆమెలోని పరిపాలన దక్షతకు నిదర్శనమని చెప్పారు. చిత్తశుద్ధితో ప్రజలకు ప్రేమతో సేవలందిస్తే పదవులు వాటంతట అవే వస్తాయని చెప్పడానికి తమిళిసై గారు నిలువెత్తు తార్కాణమని అన్నారు. ఆమెకు ఆ భగవంతుడు శతాయుష్షును ప్రసాదించాలని, ప్రజాసేవలో ఆమె నిరంతరంగా మమేకం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు.

ఇక ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భాంగా గవర్నర్ తమిళిసై గురువారం రాజ్ భవన్ లో తెలుగులో ప్రసంగం చేసి తెలంగాణ ప్రజలను ఆకట్టుకుంది. ‘‘ఈ రాష్ట్రం నాది.. నేను ఈ రాష్ట్రానికి గవర్నర్ ను మాత్రమే కాదు.. మీ సహోదరిని’’ అని అన్నారు. తాను రాష్ట్రానికి గవర్నర్ గా సేవ చేస్తూ.. ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తోందని తమిళిసై ఈసందర్భంగా వ్యాఖ్యానించారు. సవాళ్లు ఎదురవుతున్నా తాను బాధపడటం లేదని చెప్పారు. ఎవరు ఆపినా.. తెలంగాణ ప్రజలను కలుస్తాను, కలుస్తూనే ఉంటాను అని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలకు సేవలు అందిస్తూనే ఉంటానని తేల్చి చెప్పారు. ఎంతోమంది అమరుల త్యాగ ఫలితంగానే తెలంగాణకు స్వేచ్ఛ లభించిందన్నారు.

‘‘తెలంగాణకు సేవ చేయడానికి ప్రధానమంత్రి మోడీ నాకు గొప్ప అవకాశం ఇచ్చారు. నేను ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాను. ఇందులో భాగంగా రాజ్ భవన్ స్కూలులో విద్యార్థుల కోసం భోజన ఏర్పాటు చేశాను. కొవిడ్ కాలంలో నిర్విరామంగా ప్రజారోగ్య విభాగాన్ని పర్యవేక్షించాను. భద్రాచలం, ఆదిలాబాద్ ప్రాంతాలలో ఆదివాసీ ప్రజలను కలిసి సహపంక్తి భోజనం చేశాను. అక్కడి ప్రజలకు పౌష్టికాహార కిట్లు పంపిణీ చేశాను. పేద విద్యార్థులకు ల్యాప్ ట్యాప్ లు అందించాను’’ అని తమిళిసై వివరించారు.