ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

కాకినాడలో దారుణం..బాలికపై అత్యాచారానికి పాల్పడిన వసతిగృహ కరస్పాండెంట్

ఏపీలో అత్యాచారాలు తగ్గినట్లే తగ్గుతూ మళ్లీ పెరుగుతున్నాయి. నెల క్రితం వరుస గా అత్యాచార వార్తలు బయటకు రాగ…గత కొద్దీ రోజులుగా తగ్గాయి. దీంతో హమ్మయ్య అని అనుకున్నారో లేదో..మళ్లీ కాకినాడ లో దారుణం చోటుచేసుకుంది. బాలికపై వసతిగృహ కరస్పాండెంట్ అత్యాచారానికి పాల్పడ్డాడు.

వివరాల్లోకి వెళ్తే..

నగరానికి చెందిన బాధిత బాలిక ఆరో తరగతి నుంచి కొండయ్యపాలెంలోని హెల్పింగ్ హ్యాండ్స్ ప్రైవేటు వసతి గృహంలో ఉంటూ చదువుకుంటోంది. తండ్రి చనిపోవడంతో తల్లే ఆమెను చూసుకుంటోంది. ఇటీవలే తొమ్మిదో తరగతి పరీక్షలు రాసిన ఆమెపై వసతిగృహం కరస్పాండెంట్ కొత్తపల్లి విజయకుమార్ (60) కన్ను పడింది.

ఈ క్రమంలో ఈ ఏప్రిల్‌లో బాలికకు మాయమాటలు చెప్పి తన గదికి తీసుకెళ్లిన నిందితుడు విజయకుమార్ కరోనా మాత్రలంటూ బాలికకు కొన్ని మాత్రలు ఇచ్చాడు. అవి వేసుకున్నాక బాలిక మత్తులోకి జారుకుంది. ఆ తర్వాత నిందితుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇలా పలుమార్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. వేసవి సెలవుల నేపథ్యంలో ఇంటి వద్ద ఉంటున్న బాలిక మూడు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. తీవ్ర రక్తస్రావం అవుతుండడంతో ఆందోళన చెందిన ఆమె తల్లి ఆరా తీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలిని ఓ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు.. పోలీసులు పోక్సో చట్టం కింద నిందితుడిపై కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడు విజయకుమార్‌ కోసం గాలిస్తున్నారు.