ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్న బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా..వైస్సార్సీపీ సర్కార్ ఫై నిప్పులు చెరిగారు. కేంద్రం ‘ఆయుష్మాన్ భారత్’ పేరుతో ఆరోగ్య పథకాన్ని ప్రారంభించిందని, ఆ పథకాన్నే ‘ఆరోగ్య శ్రీ’ పేరుతో జగన్ ప్రభుత్వం ప్రచారం చేస్తోందన్నారు. నిజానికి ఆ పథకం సీఎం జగన్‌ది కాదని, మోడీదని ఆయన పేర్కొన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకంతో రూ.5 లక్షల వరకు వైద్య సాయం అందిస్తున్నామని, దేశవ్యాప్తంగా ఈ పథకం అమలు అవుతోందన్నారు. ఆరోగ్య శ్రీ కేవలం రాష్ట్రానికే పరిమితమని ఆయన ఎద్దేవా చేశారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం నడ్డా ఈరోజు ఏపీకి వచ్చారు.
ఈ క్రమంలో బీజేపీ శక్తి కేంద్ర ప్రముఖుల సమావేశానికి హాజరై ప్రసంగించారు. రాష్ట్రంలో 46వేలకు పైగా పోలింగ్ బూత్‌లు ఉన్నాయని.. బూత్‌ల వారీగా ప్రజల వద్దకు పార్టీని తీసుకెళ్లాల్సిన బాధ్యత శక్తి కేంద్ర ప్రముఖులపై ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ మాయమాటలు ప్రజలకు వివరించాలని ఈ సందర్బంగా సూచించారు. పార్టీలోకి నూతన కార్యకర్తలు ఆహ్వానించాలన్నారు. అన్ని వర్గాలకు ప్రాధాన్యత దక్కేలా పార్టీ చర్యలు తీసుకోవాలన్నారు.
‘ఆయుష్మాన్ భారత్’ పేరుతో బృహత్తర ఆరోగ్య పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. దాన్నే ‘ఆరోగ్యశ్రీ’ పేరుతో జగన్ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని చెప్పారు. అది జగన్ స్కీం కాదని.. నరేంద్ర మోదీదని నడ్డా వ్యాఖ్యానించారు. ఆయుష్మాన్ భారత్ పథకంతో రూ.5లక్షల వరకు వైద్యసాయం అందుతున్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని శ్రేణులకు నడ్డా సూచించారు. ఆయుష్మాన్ భారత్ ఎక్కడైనా పని చేస్తుందని.. రాష్ట్రం దాటితే ఆరోగ్యశ్రీ పనికిరాదని వ్యాఖ్యానించారు. పీఎం కిసాన్ కింద ఏటా రూ.6వేలు రైతుల ఖాతాల్లో వేస్తున్నామని ఆయన గుర్తుచేశారు. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచారు.. కరెంటు కోతలు విధిస్తున్నారని మండిపడ్డారు. రైతులకు మోదీ చేస్తున్న సాయాన్ని.. జగన్ సొంత పథకంగా చెబుతున్నారని మండిపడ్డారు.
ప్రతి బిజెపి కార్యకర్త తమ ఇంటిపై పార్టీ జెండా ఎగురవేయాలని నడ్డా సూచించారు. మన్‌కీ బాత్ ద్వారా ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చే సందేశాన్ని బూత్ స్థాయిలో కార్యకర్తలంతా సామూహికంగా వీక్షించాలన్నారు. ఆ తర్వాత ప్రధాని సందేశాన్ని అక్కడి ప్రజలతో చర్చించి వారికి చేరవేయాలన్నారు.