కొత్త ఫొటోలతో కూడిన డిజైన్‌కు కేంద్రం ఆమోదం
కరెన్సీ నోట్లపై రవీంద్రనాథ్ ఠాగూర్, అబ్దుల్ కలాం చిత్రాలను ముద్రించే అంశాన్ని భారతీయ రిజర్వు బ్యాంకు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం కరెన్సీ నోట్లపై గాంధీ చిత్రం మాత్రమే ఉంటోంది. తొలిసారి ఇతరుల చిత్రాలను కూడా కరెన్సీ నోట్లపై ముద్రించాలని ఆర్బీఐ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. 2017లోనే ఈ ప్రతిపాదన వచ్చినా ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే ఈ విషయమై త్వరలోనే ఒక నిర్ణయానికి రావాలని ఆర్బీఐ భావిస్తున్నట్లు సమాచారం.
ఈ మేరకు కొత్త వాటర్‌మార్కులు ఉన్న నోట్లను ఐఐటీ దిల్లీ గౌరవ ప్రొఫెసర్ దిలీప్ టి.షాహనీకి పంపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆయనే గాంధీ, ఠాగూర్, కలాం చిత్రాల్లో ఒకదాన్ని ఎంపిక చేస్తారట! ఆయన సెలెక్ట్ చేసిన నోటును ప్రభుత్వ ఆమోదం కోసం పంపనున్నట్లు సమాచారం. లేదంటే మూడింటినీ పంపుతారు. అయితే వాటిలో దేన్ని ముద్రించాలనే నిర్ణయం అత్యున్నత స్థాయిలో తీసుకుంటారని ప్రభుత్వవర్గాలు చెప్తున్నాయి.