దేశంలో బీజేపీని గద్దె దించితేనే ప్రజల ఆకలి తీరుతుందన్నారు మంత్రి జగదీశ్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రాన్ని శ్రీలంకతో పోల్చిన బండి సంజయ్‌పై మంత్రి జగదీశ్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. శ్రీలంకలా మారింది గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలే అని ఆయన పేర్కొన్నారు. ఆకలి ఇండెక్స్‌లో పాకిస్తాన్, బంగ్లాదేశ్ తర్వాతి స్థానంలో భారత్ ఉందంటే అందుకు బీజేపీ వైఫల్య పాలనే కారణమని చెప్పారు. బీజేపీని దేశం నుంచి తరిమికొట్టడానికి ప్రజలు మరో ఉద్యమానికి సిద్ధం కావాలన్నారు. బీజేపీని గద్దె దింపుతేనే ఈ దేశ ప్రజల ఆకలి తీరుతుందన్నారు. చైతన్యవంతమైన తెలంగాణలో బీజేపీ ఆటలు, కుట్రలు సాగవు అని జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తెలంగాణా రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతూ దేదీప్యమానంగా వెలుగొందుతుందని మంత్రి చెప్పారు. నిన్నమొన్నటి వరకు తెలంగాణా పథకాలను మెచ్చుకున్న బీజేపీ నేతలు, ఓట్ల రాజకీయం కోసం తెలంగాణపై అవాకులు, చెవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు తమకు కూడా కావాలని బీజేపీ పాలిత రాష్ట్రాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. అలాంటి పథకాలను అమలు చేయలేకనే, రాష్ట్రంపై బీజేపీ కుట్రలు చేస్తూ చీకట్లోకి నెట్టే ప్రయత్నం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.