ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యాంశాలు

వెదర్ రిపోర్ట్ : రేపు ఏపీ, తెలంగాణ లో వర్షాలు

తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి వార్త తెలిపింది. రేపు రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడబోతున్నాయని తెలిపింది. నైరుతి రుతుపవనాలు సోమవారం(ఈ నెల 13)కల్లా తెలంగాణ, ఏపీలోకి ప్రవేశించే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. శనివారం నాటికి గోవా, కొంకణ్‌, కర్ణాటక ప్రాంతాల్లో కొంతమేర విస్తరించాయని , పశ్చిమ భారత తీర ప్రాంతాలన్నింటా రుతుపవనాలు విస్తరించడంతో ఆది, సోమవారాల్లో తెలంగాణ, ఏపీల్లోకి ప్రవేశిస్తాయని పేర్కొంది.రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో రుతుపవనాలు ముందుకు సాగేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తెలిపింది. పశ్చిమ భారత ప్రాంతాల నుంచి తెలంగాణలోకి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయని.. వీటి ప్రభావంతో ఆది, సోమవారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండగా.. మరికొన్ని చోట్ల ఎండలు దంచికొడుతున్నాయి.40 డిగ్రీలకుపైగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాద్‌లోనూ ఎండలు భారీగానే ఉన్నాయి. దీంతో ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇదిలా ఉండగా.. శనివారం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకూ పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. అత్యధికంగా ఆదిలాబాద్‌ జిల్లా బేలలో 4, తలమడుగులో 3.5, పిప్పల్‌ధరిలో 3.3, వడ్యాల(నిర్మల్‌)లో 2.9, మేనూరు(కామారెడ్డి)లో 2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మరోవైపు ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలతో వడగాలులు వీస్తున్నాయని తెలిపింది. శనివారం రాష్ట్రంలో అత్యధికంగా గోధూరు(జగిత్యాల జిల్లా)లో 42.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్‌ జిల్లా భీంపూర్‌ మండలం ధనోర గ్రామంలో శనివారం పిడుగుపాటుకు గోస్కుల ఆశన్న(55) అనే రైతు తన భార్య కళ్లముందే మృతి చెందాడు.