టీఎస్ ఆర్టీసీ మరోసారి బస్ చార్జీలను భారీగా పెంచింది. ఇప్పటికే పలుమార్లు టికెట్ ధరలు పెంచిన ఆర్టీసీ..ఇప్పుడు మరోసారి పెంచడం తో ప్రయాణికులు , రాజకీయ పార్టీలు ప్రభుత్వం ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే విద్యార్థుల బస్ పాస్ చార్జీలు సైతం భారీగా పెంచేసింది. 4 కిలోమీటర్ల దూరానికి ప్రస్తుతం ఉన్న రూ.165 బస్ పాస్ ఛార్జీని రూ.450కి పెంచింది. అదే క్రమంలో 8 కి.మీ. దూరానికి రూ.200 నుంచి రూ.600కి, 12కి.మీ దూరానికి రూ. 245 నుంచి రూ.900లకు , 18 కిమీ దూరానికి రూ. 280 నుంచి 1,150 కు, 22 కిమీ దూరానికి రూ. 330 నుంచి 1350 కి పెంచింది. ఈ క్రమంలో పెరిగిన విద్యార్థుల బస్ పాస్ చార్జీలను వెంటనే తగ్గించాలని ఇప్పటికే పలు విద్యార్థి సంఘాలు బస్ భవన్ ముందు ఆందోళన చేపట్టగా..తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ సైతం బస్ పాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేసారు.
రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. బస్ పాస్ ఛార్జీలను ఊహించని స్థాయిలో పెంచడం విద్యార్థుల పాలిట పిడుగుపాటు అని ఆయన మండిపడ్డారు. ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయం పేద, మధ్య తరగతి వర్గాల నడ్డి విరిచేలా ఉందని, మోయలేని భారంతో విద్యార్థులను చదువుకు దూరం చేసేలా ఉందని విమర్శించారు. ఈ అన్యాయపు నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
అలాగే కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందిస్తూ… ఛార్జీలను పెంచాలని ఆర్టీసీ తీసుకున్న నిర్ణయంతో పేద, మధ్య తరగతి ప్రజలపై తీవ్ర భారం పడుతుందని అన్నారు. విద్యార్థుల బస్ పాస్ ఛార్జీలను ఈ రీతిలో భారీగా పెంచడం దేశంలో మరే రాష్ట్రంలోనూ లేదని విమర్శించారు. చార్జీల పెంపు నిర్ణయాన్ని తెలంగాణ ఆర్టీసీ వెంటనే వెనక్కి తీసుకోవాలని స్పష్టం చేశారు.