జాతీయం ముఖ్యాంశాలు

ప‌లువురు కాంగ్రెస్ కీల‌క నేత‌లు అరెస్ట్‌, విడుద‌ల‌ఢిల్లీలో కేసీ వేణు గోపాల్‌ను ఈడ్చుకెళ్లిన పోలీసులుకాంగ్రెస్‌కు చెందిన ఇద్ద‌రు సీఎంలు, ఖ‌ర్గే కూడా అరెస్ట్‌

కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీని ఈడీ విచార‌ణ‌కు పిలిచిన వైనంపై నిర‌స‌న వ్య‌క్తం చేస్తూ దేశ‌వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళ‌న‌ల‌కు దిగిన సంగ‌తి తెలిసిందే. రాహుల్ గాంధీని ఈడీ అధికారులు ఎంతసేపు విచారిస్తారో, అంత‌సేపు ఈడీ కార్యాల‌యాల ముందు శాంతియుతంగా నిర‌స‌న‌లు చేప‌ట్టాల‌ని కాంగ్రెస్ పార్టీ తీర్మానించిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో మ‌ధ్యాహ్నం స‌మ‌యంలో ఆ పార్టీకి చెందిన ప‌లువురు కీల‌క నేత‌ల‌ను అరెస్ట్ చేసిన పోలీసులు స‌మీపంలోని పోలీస్ స్టేష‌న్ల‌కు వారిని త‌ర‌లించారు. ఆ త‌ర్వాత వారిని విడుద‌ల చేశారు.ఇలా ఈడీ కార్యాల‌యాల ముందు నిర‌స‌న‌కు దిగిన నేత‌ల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్ద‌రు సీఎంలు అశోక్ గెహ్లాట్ (రాజ‌స్థాన్‌), భూపేష్ బాఘెల్ (ఛ‌త్తీస్‌గ‌ఢ్), రాజ్య‌స‌భ‌లో విప‌క్ష నేత మ‌ల్లికార్జున ఖ‌ర్గే, పార్టీ సీనియ‌ర్లు కేసీ వేణుగోపాల్ స‌హా మ‌రికొంద‌రు నేత‌ల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీలో కేసీ వేణుగోపాల్ అరెస్ట్ సంద‌ర్భంగా ఆయ‌న‌ను ఈడ్చుకుంటూ వెళ్లిన పోలీసుల వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. శాంతియుత నిర‌స‌న‌కు దిగినా… ఇలా దురుసుగా ప్ర‌వ‌ర్తిస్తారా? అంటూ పోలీసుల‌పై కాంగ్రెస్ శ్రేణులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి.