తెలంగాణ ముఖ్యాంశాలు

నాడు రైతుల‌తో..నేడు దేశ జ‌వాన్ల‌తో కేంద్ర ప్ర‌భుత్వం ఆడుకుంటుంది – కేటీఆర్

సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్‌ ఘటన ఫై తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ర‌క్ష‌ణ‌శాఖ ప్ర‌వేశ‌పెట్టిన అగ్నిప‌థ్ స్కీమ్‌ను వ్య‌తిరేకిస్తూ దేశ‌వ్యాప్తంగా యువ‌త ఆందోళ‌న చేప‌డుతున్న విష‌యం తెలిసిందే. గత నాల్గు రోజులుగా దేశంలోని పలు రాష్ట్రాల్లో ఆర్మీ విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వసం చేస్తూ తమ నిరసనలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో ఈరోజు సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్‌ లో ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళన ఉద్రికతకు దారితీసింది. పలు రైళ్లకు నిప్పు పెట్టడం , స్టేషన్ ను ధ్వసం చేయడం తో పోలీసులు లాఠీచార్జి చేసారు. ఈ క్రమంలో పోలీసులపై విద్యార్థులు రాళ్ల దాడి చేయడం తో , పోలీసులు వారిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో వరంగల్ కు చెందిన రాకేష్ అనే యువకుడు ప్రాణాలు వదిలాడు.

ఇక ఈ ఘటన పట్ల మంత్రి కేటీఆర్ స్పందించారు. దేశంలో నిరుద్యోగ సంక్షోభం తీవ్ర స్థాయిలో ఉంద‌ని, అగ్నివీర్ స్కీమ్‌ను వ్య‌తిరేకిస్తూ జ‌రుగుతున్న ఆందోళ‌న‌లు ఆ తీవ్ర‌త‌ను సూచిస్తున్నాయ‌ని మంత్రి కేటీఆర్ త‌న ట్విట్ట‌ర్‌లో తెలిపారు. తొలుత దేశ రైతుల‌తో కేంద్ర ప్ర‌భుత్వం ఆడుకుంద‌ని, ఇప్పుడు దేశ జ‌వాన్ల‌తోనూ ఆడుకుంటోంద‌ని మంత్రి ఆరోపించారు. వ‌న్ ర్యాంక్ వ‌న్ పెన్ష‌న్ విధానం నుంచి ఇప్పుడు దేశంలో నో ర్యాంక్ నో పెన్ష‌న్ గా మారింద‌ని మంత్రి కేటీఆర్ త‌న ట్విట్ట‌ర్‌లో కేంద్ర వైఖ‌రిని విమ‌ర్శించారు.