తెలంగాణ ముఖ్యాంశాలు

సికింద్రాబాద్ ఘటన పట్ల రాష్ట్ర సర్కార్ ఫై ఆగ్రహం వ్యక్తం చేసిన కిషన్ రెడ్డి

అగ్నిపథ్ కు వ్యతిరేకంగా ఈరోజు ఉదయం నుండి ఆర్మీ విద్యార్థులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఆందోళన ఉద్రికత్తకు దారి తీయడం తో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో వరంగల్ యువ‌కుడు మృతిచెందాడు. అత‌డిని ఖానాపురం మండ‌లం ద‌బీర్‌పేట‌కు చెందిన రాకేశ్‌గా పోలీసులు గుర్తించారు. ఈ మేర‌కు పోలీసులు రైల్వే అధికారులు స‌మాచార‌మిచ్చారు. అలాగే పదుల సంఖ్యలో యువకులకు గాయాలు కావడం తో వారిని గాంధీ ఆసుపత్రి లో చికిత్స అందిస్తున్నారు.

ఇక రైల్వే స్టేషన్ ఘటన ఫై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు.ముందస్తు పథకం ప్రకారమే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసానికి పాల్పడ్డారని ఆరోపించారు. అగ్నిపథ్ పై యువతను తప్పుదోవ పట్టించే ప్రయత్నం సరికాదని స్పష్టం చేశారు. కుట్ర పన్ని, రైల్వే స్టేషన్ ను లక్ష్యంగా ఎంచుకోవడం దారుణమని పేర్కొన్నారు.

రైలు బోగీలకు నిప్పుపెట్టారని, పలు బోగీలను ధ్వంసం చేశారని కిషన్ రెడ్డి వెల్లడించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో సీసీ కెమెరాలు ధ్వంసం చేశారని, రైల్వే స్టేషన్ ప్రాంగణంలోని ప్రయాణికుల బైక్ లు తగలబెట్టారని తెలిపారు. విధ్వంసానికి భయపడి ప్రయాణికులు తమ లగేజీ కూడా వదిలిపెట్టి పరుగులు తీశారని వివరించారు. ఇంత జరుగుతున్నా రాష్ట్ర పోలీసులు చూస్తూ ఉండిపోయారని, వారికి బాధ్యత లేదా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. శాంతిభద్రతలు కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు.

సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్‌లో ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో రైల్వే అధికారులు ప్ర‌యాణికుల కోసం హెల్ప్ లైన్ నంబ‌ర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. రైళ్ల వివ‌రాల కోసం అధికారుల‌ను సంప్ర‌దించాల్సిన నంబ‌ర్ 040-27786666.