అంతర్జాతీయం ముఖ్యాంశాలు

అమెరికాలో కాల్పులు..యువకుడు మృతి

మరోసారి అగ్రరాజ్యం అమెరికాలో కాల్పుల మోతమోగింది. వాష్టింగన్‌ డీసీలోని 14వ, యూస్ట్రీట్‌లో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. ఓ పోలీస్‌ అధికారి సహా ముగ్గురు గాయపడ్డారని అధికారులు తెలిపారు. వైట్‌ హౌస్‌కు రెండు మైళ్లదూరంలో యూ స్ట్రీట్‌ నార్త్‌వెస్ట్‌లో ఓ సంగీత కచేరి కార్యక్రమంలో కాల్పులు జరిగాయని పోలీసులు తెలిపారు. కాల్పుల నేపథ్యంలో ఆ ప్రాంతం వైపుగా ఎవరూ వెళ్లొద్దని సూచించారు. అయితే, కాల్పులకు కారణాలు తెలియరాలేదు. ఇటీవల కాలంలో అమెరికాలో వరుసగా కాల్పుల ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.

మే 24న టెక్సాస్‌లోని రాబ్‌ ఎలిమెంటరీ స్కూల్‌లో జరిగిన కాల్పుల్లో 19 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఫ్లోరిడాలోని పార్క్‌ల్యాండ్‌లో 2018లో మార్జోరీ స్టోన్‌మ్యాన్‌ డగ్లస్‌ హైస్కూల్‌ కాల్పుల తర్వాత అత్యంత విషాదకరమైన సంఘటన. అప్పటి దాడిలో 17 మంది మరణించారు. మే 31న న్యూ ఓర్లీన్స్‌లోని హైస్కూల్ గ్రాడ్యుయేషన్ వేడుకల్లో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఇద్దరు గాయపడ్డారు. ఈ నెల 1న ఓక్లహోమాలో ఆసుపత్రి క్యాంపస్‌లో జరిగిన కాల్పుల ఘటనలో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. అగ్రరాజ్యంలో వరుసగా జరుతున్న కాల్పుల ఘటనలతో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.