టీడీపీ సీనియర్ నేత అయ్యనపాత్రుడికి హైకోర్టు నుండి ఊరట లభించింది. పంట కాల్వను ఆక్రమించి గోడను నిర్మించారని, ప్రభుత్వ భూమిలోని రెండు సెంట్లు ఆక్రమించారని నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ నర్సీపట్నంలోని అయ్యనపాత్రుడి ఇంటి గోడను జేసీబీ లతో కూల్చిన సంగతి తెలిసిందే. దీనిపట్ల అయ్యన్న కోర్ట్ ను ఆశ్రయించగా..ఇంటి ప్రహారీ గోడను నిర్మించుకునేందుకు అనుమతిచ్చింది.
నోటీసులు ఇవ్వకుండా.. అక్రమంగా ఇంటి గోడను నర్సీపట్నం మున్సిపల్ అధికారులు కూల్చివేశారని అయ్యన్న కోర్టును ఆశ్రయించారు. దీనిపై న్యాయస్థానంలో విచారణ జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా గోడ కూల్చారని పిటిషనర్ తరఫు న్యాయవాది న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. పిటిషనర్ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం.. గోడ కట్టుకునేందుకు అనుమతిచ్చింది. అనంతరం విచారణను వాయిదా వేసింది.
అసలు ఏంజరిగిందనేది చూస్తే ..
నర్సీపట్నంలో అయ్యన్న పాత్రుడు పంటకాలువ ఆక్రమించి ఇంటి నిర్మాణం చేపట్టారంటూ.. ఈనెల 19న అర్ధరాత్రి మున్సిపల్ సిబ్బంది జేసీబీలతో ఇంటి గోడను కూల్చివేశారు. రెండు సెంట్ల భూమి ఆక్రమించి నిర్మాణం చేపట్టారంటూ మున్సిపల్ సిబ్బంది నోటీసులో పేర్కొన్నారు. ఈ నెల రెండో తేదీతో ఉన్న నోటీసును ఇప్పుడు ఇచ్చి.. వెంటనే గోడ తొలగించడంపై అయ్యన్నపాత్రుడి కుటుంబసభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అన్ని నియమాలకు లోబడే ఇంటి నిర్మాణం చేశామని.. ఇంటి గోడ ధ్వంసం చేయడం ఏంటి అని కుటుంబ సభ్యులు ప్రశ్నించారు. ఈ క్రమంలో పోలీసులు వారితో వాగ్వాదానికి దిగారు. దీంతో టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని అడ్డుకున్నారు. రెండు రోజుల పాటు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.