కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ కు వ్యతిరేకంగా ఇప్పటికే ఆర్మీ విద్యార్థులు దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఈ పథకాన్ని రద్దు చేయాలంటూ మొదటినుండి చెపుతూ వస్తుంది. అయినప్పటికీ కేంద్రం ఇవేమీ పట్టించుకోకుండా అగ్నిపథ్ నియామకాలు చేపడుతుంది. ఈ తరుణంలో అగ్నిపథ్ స్కీంకు వ్యతిరేకంగా ఈనెల 27న కాంగ్రెస్ దేశవ్యాప్తంగా సత్యాగ్రహం నిర్వహిస్తుందని ఆ పార్టీ నేత, రాజ్యసభ ఎంపీ కేసీ వేణుగోపాల్ బుధవారం పేర్కొన్నారు.
సత్యాగ్రహంలో అన్నినియోజకవర్గాల్లో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ నిరసనలు చేపడతారని తెలిపారు. అగ్నిపథ్ స్కీంకు వ్యతిరేకంగా తమ పోరాటం నిరంతరం కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. అంతకుముందు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అగ్నిపథ్‌ను తక్షణమే వెనక్కితీసుకోవాలని మరోసారి డిమాండ్ చేశారు. తాత్కాలిక సైనిక నియామక పధకంతో కేంద్రం ఆర్మీని నిర్వీర్యం చేస్తోందని దుయ్యబట్టారు. కాషాయ పాలకులు వన్ ర్యాంక్..వన్ పెన్షన్ గురించి మాట్లాడతరాని, వారు ఇప్పుడు నో ర్యాంక్..నో పెన్షన్‌తో ముందుకొచ్చారని ఎద్దేవా చేశారు.