రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా నామినేషన్ వేసిన ముర్ము
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా ఎంపికైన ద్రౌపది ముర్ము శుక్రవారం తన నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోడీ సహా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్‌లు వెంట రాగా… పార్లమెంటు సెక్రటేరియట్‌లో ముర్ము నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమానికి వైస్సార్సీపీ నుంచి ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత వేణుంబాక విజయసాయిరెడ్డి, లోక్‌సభలో పార్టీ నేత పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డిలు కూడా హాజరయ్యారు.
ఇదిలా ఉంటే… ద్రౌపది ముర్ము అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ ఓటు హక్కు కలిగిన 50 మంది సంతకాలు చేయగా, మరో 50 మంది ఆ ప్రతిపాదనలను బలపరచాల్సి ఉన్న సంగతి తెలిసిందే. ఇలా ముర్ము అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించే అవకాశం ఏపీ నుంచి తనకు ఒక్కడికి మాత్రమే దక్కిందంటూ గురువారం ఏపీకి చెందిన బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే సీఎం రమేశ్‌తో పాటు ముర్ము అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ ఏపీకి చెందిన మరో ఇద్దరు నేతలు కూడా సంతకాలు చేశారు. వారు వైస్సార్సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డిలు. వెరసి ముర్ము అభ్యర్థిత్వాన్ని ఏపీ నుంచి ప్రతిపాదించిన వారి సంఖ్య 3కు చేరింది.