న్యూఢిల్లీ, జూన్ 22: మీ దగ్గర పాత రూ.5, 10 నాణేలు ఉన్నాయా?.. వాటిపై మాతా వైష్ణోదేవి బొమ్మ ఉందా?.. ఇంకేముంది మీరు లక్షాధికారులైపోయినట్లే. అవును.. ఈ నాణేలను ఒక్కోటి వేలు, కాదంటే లక్షల్లో ఇచ్చి కొంటున్నారట. కొన్ని ఆన్‌లైన్ వెబ్‌సైట్లలో ఇందుకు సంబంధించిన ఎక్సేంజ్ (మార్పిడి) ఆఫర్లు కూడా జోరుగా నడుస్తున్నాయని సమాచారం. గరిష్ఠంగా ఒక్క నాణెం రూ.10 లక్షలు పలుకుతోందట.
ఇంత డిమాండ్ ఉందా?
పాత వస్తువులను వెబ్‌సైట్లలో పెట్టి అమ్మడం ద్వారా లక్షల రూపాయలను ఆర్జించారని మనం వినే ఉంటాం. ఏదైనా ఒక వస్తువు పాతబడితే అది పురాతన వర్గంలోకి వెళ్లిపోతుంది. అలాంటి వాటికి అప్పుడప్పుడు అంతర్జాతీయ మార్కెట్లలో మంచి డిమాండ్ కనిపిస్తుంది. అమ్మితే ఆకర్షణీయ ధర వస్తుంది. అలాగే నాణేల సేకరణ అలవాటు ఉన్నవారికి ఇప్పుడు సమయం వచ్చింది. వారి వద్ద మాతా వైష్ణోదేవి బొమ్మ ఉన్న రూ.5, 10 నాణేలుంటే ఆన్‌లైన్ వెబ్‌సైట్లలో వేలానికి పెట్టవచ్చు. నిజానికి 2002లోనే ప్రభుత్వం ఈ నాణేలను ముద్రించింది. అయితే మాతా వైష్ణోదేవి బొమ్మగల నాణేలు శుభప్రదమని భావిస్తున్న కొందరు వీటిని ఎంతైనా పెట్టి కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తున్నది.
పాత నోట్లకూ..
పాత నోట్లకూ ఇదే తరహా డిమాండ్ వ్యక్తమవుతున్నది. ఒకటి, రెండు, ఐదు, పది రూపాయల పాత నోట్లనూ పెద్ద ఎత్తున నగదు చెల్లించి కొంటున్నట్లు సమాచారం. ట్రాక్టర్ బొమ్మగల పాత 5 రూపాయల నోటు రూ.30,000 పలుకుతున్నట్లు వినిపిస్తున్నది. అలాగే ‘786’ సిరీస్ నోట్లకూ ముస్లీముల నుంచి భారీ డిమాండ్ వస్తున్నది.
ఎలా అమ్మవచ్చు?
పాత, అరుదైన నాణేలు, కరెన్సీ నోట్లు మీవద్ద ఉన్నట్లయితే వాటిని ఆన్‌లైన్‌లో వేలానికి పెట్టవచ్చు. ఇందుకోసం మీరు coinbazzar.com వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. ఇటీవలే ఇందులో రూపాయి నోటుకు రూ.45,000 పొందవచ్చని ఆఫర్ కూడా వచ్చింది. అలాగే indiamart.com వెబ్‌సైట్‌కూ వెళ్లవచ్చు. నాణేలు, కరెన్సీల ఫోటోలను అప్‌లోడ్ చేయవచ్చు. ఇంకేముంది మీ పర్సుల్లోనో.. బీరువాల్లోనో ఉన్న పాత కాయిన్లను తీసి వేలానికి పెట్టండి. మీ దశ తిరిగి కోటిశ్వరులైపోతారేమో.