జాతీయం ముఖ్యాంశాలు

భారత ప్రభుత్వం కీలక నిర్ణయం : జూలై 1 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం

పర్యావరణ పరిరక్షణలో భాగంగా భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒకసారి వాడకానికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్‌పై జులై 1 నుంచి దేశవ్యాప్తంగా నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా మానవాళి మనుగడకు, పర్యావరణానికి ప్లాస్టిక్‌ వ్యర్థాలు తీవ్ర హాని చేస్తున్నాయి. ప్లాస్టిక్‌ ప్రభావంతో భూమిపై నివసిస్తున్న ప్రాణులన్నింటికి పెను ప్రమాదం పొంచి ఉన్నది.

ప్లాస్టిక్‌ కాలుష్యంలో ‘సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌’ అంటే కేవలం ఒకేసారి వాడి పారేసే ప్లాస్టిక్‌దే అగ్రస్థానం. ప్లాస్టిక్ బ్యాగ్‌లు, నీళ్ల సీసాలు, సోడా సీసాలు, స్ట్రాలు, ప్లేట్లు, కప్పులు, ఫుడ్ ప్యాకేజీ కంటెయినర్లు తదితర ప్లాస్టిక్ వస్తువులు ఈ జాబితాలోకి వస్తాయి. ప్లాస్టీక్ తో ముప్పు వాటిల్లుతుందని.. ఇప్పటికే దీన్ని 60కి పైగా దేశాలు నిషేధించాయి. ఈ క్రమంలో భారత ప్రభుత్వం కూడా జులై 1 నుంచి సింగిల్‌ యూజ్‌ (ఒకసారి వాడిపారేసే) ప్లాస్టిక్‌పై నిషేధం విధించింది. దీంతో సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ ప్లేట్లు, స్ట్రాలు, కప్పులు, కవర్లు వంటివి కనుమరుగు కానున్నాయి.

ప్రభుత్వం ఉత్తర్వులను ఉల్లంఘిస్తే జైలు.. ప్లాస్టిక్‌పై నిషేధాన్ని కేంద్ర స్థాయిలో సెంటర్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు(సీపీసీబీ), రాష్ట్రస్థాయిలో స్టేట్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు(ఎస్‌పీసీబీ) పర్యవేక్షిస్తుంది. నిషేధాన్ని ఉల్లంఘిస్తే ఇన్విరాన్‌మెంట్‌ ప్రొటెక్షన్‌ చట్టం-1986 కింద ఐదేండ్ల వరకు జైలు శిక్ష(లేదా) లక్ష రూపాయల జరిమానా(లేదా) రెండూ విధించవచ్చు.