ycp
ఆంధ్రప్రదేశ్ జాతీయం

గోదావరి ఎమ్మెల్యేల్లో టెన్షన్… టెన్షన్…

వైసీపీలో టెన్షన్ కొనసాగుతోంది. అభ్యర్థుల మార్పునకు సంబంధించి రెండు జాబితా సోమవారం విడుదల కానుంది అని తెలియడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 11 మంది అభ్యర్థులను మార్చిన సంగతి తెలిసిందే. అందులో ముగ్గురు మంత్రులకు స్థానచలనం జరిగింది. చాలామంది ఎమ్మెల్యేలకు ప్లేస్ మారింది. కొందరికి టికెట్ దక్కలేదు. ఈ నేపథ్యంలో రెండో జాబితాలో ఎటువంటి సంచలనాలు బయటపడతాయోనని పార్టీలో ఒక రకమైన చర్చ నడుస్తోంది.ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాల విషయంలో హైకమాండ్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఓ ముగ్గురు ఎమ్మెల్యేలను పిలిచి మార్పు విషయం స్పష్టంగా చెప్పడంతో గోదావరి జిల్లాలో వాతావరణం వేడెక్కింది. మరికొందరి పేర్లు మార్చుతారని ప్రచారం జరగడంతో ఆయా నియోజకవర్గాల్లో ద్వితీయ శ్రేణి నాయకత్వం సమావేశం అయ్యింది. స్థానిక ఎమ్మెల్యేకు మద్దతుగా వారు మాట్లాడడం విశేషం. రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థుల మార్పు తప్పదన్న నియోజకవర్గాల్లో ఒక రకమైన చర్చ నడుస్తోంది.

అస్పష్టత నెలకొంటోంది. ఎవరికి టిక్కెట్లు ఉంటాయో? ఉండవో? అని ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. నియోజకవర్గాల్లో రకరకాలైన పేర్లు తెరపైకి వస్తున్నాయి.కాకినాడ జిల్లా వైసీపీలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. హై కమాండ్ నుంచి కొందరు వైసీపీ ఎమ్మెల్యేలకు పిలుపు వచ్చిందని ప్రచారం సాగడంతో మిగిలిన వారిలో టెన్షన్ పెరిగింది. ప్రధానంగా ఎమ్మెల్యేలు చంటిబాబు, ప్రసాద్, దొరబాబులకు పిలుపు వచ్చినట్లుగా చెబుతున్నారు. అయితే అటు జగ్గంపేటలో సైతం ద్వితీయ శ్రేణి నాయకత్వం సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అక్కడ కూడా అభ్యర్థిని మార్చుతారని టాక్ నడుస్తోంది. కాకినాడ ఎంపీ వంగా గీతను పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని చెబుతున్నారు. 2009లో ఆమె పిఆర్పి నుంచి గెలవడమే అందుకు కారణం. అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న దొరబాబు ని ఎంపీగా స్థానచలనం కల్పిస్తారని తెలుస్తోంది.జగ్గంపేట టిక్కెట్ను మాజీ మంత్రి తోట నరసింహం కి ఇస్తారని టాక్ నడుస్తోంది. 2004, 2009 ఎన్నికల్లో ఆయన గెలిచారు.

కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పని చేశారు. దీంతో అక్కడ మార్పు అనివార్యంగా కనిపిస్తోంది. అదే జరిగితే సిట్టింగ్ ఎమ్మెల్యే చంటిబాబు పరిస్థితి ఏంటి అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఆయనకు ప్రత్యామ్నాయ అవకాశం ఇస్తారా? లేకుంటే పక్కన పెడతారా అన్నది తెలియాల్సి ఉంది. ప్రత్తిపాడు అసెంబ్లీ సీటుకు సంబంధించి పర్వత ప్రసాద్ కు కూడా ఈసారి టికెట్ కష్టమేనని తేలుతోంది. మొత్తానికైతే రెండో జాబితాలో ఉభయగోదావరి జిల్లాల నేతల భవితవ్యం ఉన్నట్లు తేలుతోంది.