సత్యసాయి జిల్లా తాడిమర్రి మండలంలో కదులుతున్న ఆటో ఫై హై టెన్షన్ విద్యుత్ తీగలు పడి పెను ప్రమాదం జరిగింది. తీగలు పడడం తో ఆటోలో మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు సజీవ దహనం అయ్యారు. మరో 6 మంది గాయాలతో బయటపడ్డారు. నాణ్యత లోపం వల్లే తీగలు తెగిపడ్డాయని అక్కడి స్థానికులు చెపుతున్నారు. ఈ తరుణంలో ఈ ప్రమాదం ఫై ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ హరనాథరావు స్పందించారు.
విద్యుత్ తీగ నుంచి స్థంబంపై ఉన్న ఇనుప క్లాంప్ మీదకు ఉడత దూకిందని , ఉడత దూకిన సమయంలో షార్ట్ సర్క్యూట్, ఎర్త్ కావడంతో తీగలు తెగి అదే సమయంలో ఆటోపై హైటెన్షన్ విద్యుత్ తీగలు పడ్డాయని హరనాథరావు చెప్పుకొచ్చారు. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు సంస్థ తరుఫున రూ. 5లక్షలను అందజేస్తామని ప్రకటించారు. గాయపడ్డ వారికి రూ. 2లక్షల ఆర్థిక సహాయం అందిస్తామని వెల్లడించారు. ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలని సీఎండీ అనంతపురం సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజినీర్‌ను ఆదేశించారు.
ఇక ఈ ఘటన లో ప్రాణాలు కోల్పోవడంపై సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ ప్రమాదంలో గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. బాధితుల కుటుంబాలకు అండగానిలుస్తామని అన్నారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని సీఎం అధికారులను ఆదేశించారు.