తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. ఎంసీఆర్ హెచ్ఆర్‌డీలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. రెగ్యులర్ విద్యార్థులు 5,03,579 మంది పరీక్షలకు హాజరు కాగా, 4,53,201 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా టెన్త్ ఫలితాల్లో 90 శాతం ఉత్తీర్ణత సాధించడం జరిగింది. ఇక ప్రయివేటు విద్యార్థుల విషయానికి వస్తే 819 మంది హాజరు కాగా, 425 మంది పాసయ్యారు. 51.89 శాతం ఉత్తీర్ణత సాధించారు.
ఈ సారి ఫలితాల్లో బాలికలు హవా కొనసాగింది. బాలికలు 92.45 శాతం ఉత్తీర్ణత సాధించారు. అబ్బాయిలు 87.61 శాతం పాసయ్యారు. ఓవర్ ఆల్ గా 90 శాతం విద్యార్థులు పాసయ్యారని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మొత్తం 3007 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించిగా.. 15 పాఠశాలల్లో సున్నా శాతం ఫలితాలు సాధించాయి. రాష్ట్రంలో పదో తరగతి ఫలితాల్లో సిద్దిపేట జిల్లా 97.85 శాతం ఉత్తీర్ణత సాధించి మొదటి స్థానంలో, రెండో స్థానంలో నిర్మల్ ,రంగారెడ్డి జిల్లా 79.63 శాతం ఫలితాలతో చివరి స్థానంలో ఉందని వెల్లడించారు.
ఈ ఏడాది మే 23 నుంచి జూన్ 1 వరకు పది పరీక్షలు నిర్వహించారు. మొత్తం 5,08,143 రెగ్యులర్ విద్యార్థులకు 5,03,114 మంది ఎస్సెస్సీ పరీక్షలు రాశారు. 167 మంది ప్రయివేటు విద్యార్థులకు 87 మంది పరీక్షలకు హాజరయ్యారు.