beverages
తెలంగాణ

అమ్మకాలు పెంచడమే లక్ష్యం.. అప్పిస్తాం తీసుకోండి : బెవరేజెస్‌ కార్పొరేషన్‌

ప్రభుత్వ ఖజానా నిండేది మద్యం అమ్మకాల వల్లే.. మద్యం ఏరులై పారుతుంటే ప్రభుత్వ గల్లా పెట్టె గలగలమంటుంది. అమ్మకాలను పెంచడమే లక్ష్యంగా బెవరేజెస్ కార్పొరేషన్ మొదటిసారి అప్పు ఇచ్చి మరీ కొనుగోలు దారులను ప్రోత్సహించేందుకు సిద్దమైంది. ఈ మేరకు సంబంధిత అధికారులు అన్ని మద్యం డిపోలకు ఉత్తర్వులు జారీ చేశారు.

మద్యం కొనుగోలు చేసేవారికి అప్పు సదుపాయం కల్పించడం కార్పొరేషన్ చరిత్రలో ఇదే మొదటిసారి. ఇప్పటివరకు లక్ష విలువైన మద్యం కొనుగోలు చేస్తే అంతే చలానా కడితే సరిపోయేది.. ఇప్పుడు లక్షకు చలానా కడితే లక్షన్నర మద్యం అందిస్తారు. అదనపు రూ.50వేలు అప్పుగా అందిస్తున్నారు. ఇందుకోసం పోస్ట్ డేటెడ్ చెక్ ఇస్తే సరిపోతుంది. ఈ సదుపాయం సెప్టెంబర్ 5 వరకు అమలులో ఉంటుంది.

రాష్ట్రంలో మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ ఇటీవలే పూర్తయింది. దరఖాస్తు రూ.2 లక్షలైనా వెనుకాడలేదు.. ఒక్కొక్కరు పదుల సంఖ్యలో అప్లికేషన్లు పెట్టుకున్నారు. ఉన్నడబ్బంతా వీటికే ఖర్చు చేయడంతో మద్యం కొనుగోలుకు దుకాణదారుల వద్ద నగదు నిల్వలు లేవని గుర్తించిన బెవరేజెస్ అధికారులు 50% అప్పు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.