తెలంగాణ

శ్రీ జగదాంబిక అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన తెలంగాణ మంత్రులు

ఈరోజు నుండి ఆషాడ మాసం మొదలుకావడం తో హైదరాబాద్ లో బోనాల ఉత్సవాలు మొదలయ్యాయి. ముందుగా గోల్కొండ శ్రీ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పిస్తారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరుపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు తెలంగాణ మంత్రులు. లంగర్‌హౌజ్‌ చౌరస్తా వద్ద బంగారు బోనానికి మంత్రులు ఇంద్రకరణ్‌ రెడ్డి, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్, మ‌హ‌మూద్ అలీ దీపం వెలిగించి, పూజలు నిర్వహించి తొట్టెల‌కు స్వాగతం పలికారు.

అనంత‌రం శ్రీ జగదాంబిక అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సంద‌ర్భంగా దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి మాట్లాడుతూ.. బోనాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు సీఎం కేసీఆర్ రూ.15 కోట్లు కేటాయించారన్నారు. సీఎం ఆదేశాల మేర‌కు బోనాల ఉత్సవాలను ఘ‌నంగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేశామ‌ని ఆయన తెలిపారు. నెల రోజులు ఎంతో సంబరంగా జరపుకొనే పండగ ఇదని అన్నారు. అమ్మవారి దయతో తెలంగాణ రాష్ట్రంలో మంచి వర్షాలు కురవాలని అన్నారు. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని, రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలన్నారు. అన్ని డిపార్ట్మెంట్స్ సమన్వయంతో బోనాల పండగను ఘనంగా నిర్వహిస్తున్నామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు.

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ఈ రోజు మొదటి బోనంతో పండగను ప్రారంభించుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడిన తరవాత రాష్ట్ర పండుగగా బోనాలు జరుపుకుంటున్నామన్నారు. బోనాల పండగకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా నిధులు కేటయించారని తెలిపారు. గోల్కొండ ప్రాంతానికి సంబంధించి బోనాలకు అన్ని ఏర్పాట్లును అన్ని డిపార్ట్మెంట్స్ సమన్వయంతో పని చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేశామన్నారు.