తెలంగాణ

య‌శ్వంత్ సిన్హా రాకపై మంత్రులతో కేటీఆర్ సమావేశం

విప‌క్షాల రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి య‌శ్వంత్ సిన్హా జులై 02 న హైదరాబాద్ కు రానున్నారు. ఈ తరుణంలో టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ య‌శ్వంత్ సిన్హా స్వాగ‌త ఏర్పాట్లు, ఆయ‌నకు మ‌ద్ధ‌తుగా నిర్వ‌హించే స‌భ‌పై గురువారం మంత్రులు, ఇత‌ర నాయ‌కుల‌తో స‌మావేశం ఏర్పాటు చేసారు. య‌శ్వంత్ సిన్హాకు ఘ‌నంగా స్వాగతం ప‌లుకాల‌ని టీఆర్ఎస్ పార్టీ నిర్ణ‌యించింద‌ని కేటీఆర్ పేర్కొన్నారు. ఆ మేర‌కు ఏర్పాట్లు చేయాల‌ని మంత్రుల‌కు కేటీఆర్ ఆదేశించారు.

య‌శ్వంత్ సిన్హా జులై 2వ తేదీన ఉద‌యం 10 గంట‌ల‌కు ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. అక్క‌డ్నుంచి నేరుగా జ‌ల‌విహార్‌కు చేరుకుంటారు. ఉద‌యం 11 గంట‌ల‌కు య‌శ్వంత్ సిన్హాకు మ‌ద్ద‌తుగా టీఆర్ఎస్ పార్టీ స‌భ నిర్వ‌హించ‌నుంది. ఈ స‌మావేశానికి టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజ‌రు కానున్నారు. ఇక కాంగ్రెస్‌ పార్టీ కూడా సిన్హాకు మద్దతునిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలతోనూ ఆయన విడిగా భేటీ కానున్నారు. ఇక విప‌క్షాల రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి య‌శ్వంత్ సిన్హా త‌న నామినేష‌న్‌ను సోమ‌వారం దాఖ‌లు చేసిన సంగతి తెలిసిందే. జులై 18 న రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో నిన్న బుధువారం తో నామినేషన్ల గడువు పూర్తయింది. మొత్తం 115 నామినేషన్ పత్రాలు దాఖలయ్యాయి.

అందులో 28 నామినేషన్లను వివిధ సాంకేతిక కారణాల వల్ల ప్రాథమిక దశలోనే తిరస్కరించారు. 72 మంది అభ్యర్థులు దాఖలు చేసిన 87 నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారి గురువారం పరిశీలిస్తారు. అందులో నిబంధనల ప్రకారం దాఖలు చేయని వాటిని తిరస్కరించనున్నారు. రాష్ట్రపతి ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రతి నామినేషన్‌ను 50 మంది ఓటర్లు ప్రతిపాదించడం, మరో 50 మంది బలపరచడం తప్పనిసరి. ఇంతమంది మద్దతు కూడగట్టడం సామాన్య అభ్యర్థులకు సాధ్యం కాదు కాబట్టి చివరికి ఎన్డీయే అభ్యర్థి ద్రౌపదీ ముర్ము, ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా మాత్రమే బరిలో మిగిలే అవకాశం ఉంది.