టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ఏపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. యువతకు ఉద్యోగాలు ఇస్తున్నామని సీఎం జగన్ మభ్యపెడుతున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష నేతగా జగన్ అప్పట్లో యువతకు ఇచ్చిన హామీ అతి పెద్ద మోసమని అన్నారు. నిరుద్యోగిత రేటు ఇప్పటికే 13.5 శాతానికి పెరిగిపోయిందని యనమల చెప్పారు. ఏపీలో పరిశ్రమలకు ప్రోత్సాహకాలు లేక ఏ పరిశ్రమా రాష్ట్రానికి రావట్లేదని, పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ఆసక్తి చూపట్లేరని అన్నారు. కేంద్రంతో జగన్ ములాఖత్ అవడం వల్ల యువతకు నష్టం వాటిల్లిందని ఆయన ఆరోపించారు. వైస్సార్సీపీ ఎంపీలంతా తమ పదవులకు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అంతమంది వైస్సార్సీపీ ఎంపీలు ఉండి కూడా రాష్ట్రానికి ప్రత్యేక హోదాను సాధించడంలో విఫలమయ్యారని యనమల విమర్శించారు.
కాగా, ఏపీ ముఖ్యమంత్రి జగన్ నిన్న 2021-22 జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన విషయం తెలిసిందే. రెండేళ్లలో తాము లక్షలాది ఉద్యోగాలు కల్పించామని జగన్ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలోనే ఆయనపై ప్రతిపక్ష పార్టీల నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.