అయోధ్య లో రామమందిర నిర్మాణం చేపడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఈ మందిరానికి రూ.3,400 కోట్లు విరాళాలు వచ్చినట్లు రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు తెలిపింది. ఇప్పటి వరకు 11 కోట్ల మంది దాతలు నుంచి ఈ విరాళాలు ఇచ్చినట్లు ప్రకటించింది. కనిష్టంగా రూ. 10 నుంచి గరిష్ఠంగా కోటి రూపాయల వరకు విరాళాలు ఇచ్చారని వెల్లడించింది. పేద , ధనిక , చిన్న , పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు మందిరానికి తమ వంతు సాయం అందజేస్తున్నారని ట్రస్ట్ తెలిపింది. 2024 జనవరి నాటికి ఆలయ గర్భగుడి సిద్ధమవుతుందని వెల్లడించింది.
ఇక 2.7 ఎకరాల విస్తీర్ణంలో ప్రధాన ఆలయాన్ని నిర్మిస్తున్నారు. మందిరం పొడవు 360 అడుగులు, వెడల్పు 235 అడుగులు ఉండనుంది. మూడు అంతస్తులతో నిర్మించనున్న ఈ మందిరం ఎత్తు 161 అడుగులు ఉంటుంది. రెండున్నర అడుగుల పొడవు ఉన్న 17 వేల రాళ్లను మందిరం నిర్మాణంలో ఉపయోగిస్తున్నారు. అయోధ్యలో రామాలయం నిర్మాణానికి మార్గం సుగమం చేస్తూ 2019లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. 2020 ఆగస్టు 5న అయోధ్య రామ మందిర నిర్మాణం లాంఛనంగా ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. వేద మంత్రాల మధ్య ఆలయానికి పునాది రాయి వేయడం జరిగింది.