రేపటి నుంచి జన వాణి-జనసేన భరోసా కార్యక్రమం
ప్రజల నుంచి సమస్యలు తెలుసుకునేందుకు జులై 3న విజయవాడలో జనసేన పార్టీ జన వాణి కార్యక్రమానికి రూపకల్పన చేసింది. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్వయంగా ప్రజల నుంచి సమస్యల తాలూకు విజ్ఞాపన పత్రాలు స్వీకరిస్తారు. ఈ కార్యక్రమానికి పవన్ కల్యాణ్ రానున్నారు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఈ కార్యక్రమానికి వచ్చేవారు శాలువాలు, బొకేలతో రావొద్దని స్పష్టం చేసింది.
దయచేసి ఈ వేదికపై శాలువాలతో సత్కరించడం, బొకేలు ఇచ్చేందుకు సమయం వృథా చేయవద్దని సూచించింది. కేవలం సమస్యలతోనే రావాలని ఓ ప్రకటనలో పేర్కొంది. పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రత్యక్షంగా ప్రజా సమస్యలు తెలుసుకుని ప్రజలకు భరోసా నింపేందుకు జన వాణి-జనసేన భరోసా కార్యక్రమం ఏర్పాటు చేశారని ఆ ప్రకటనలో వెల్లడించింది. ఈ కార్యక్రమాన్ని కేవలం ప్రజా సమస్యల వేదికగా మలచాలని పవన్ కల్యాణ్ కోరుకుంటున్నారని జనసేన పార్టీ వివరించింది. ప్రతి ఒక్కరూ ఈ నియమాన్ని పాటించాలని విజ్ఞప్తి చేసింది.