షేక్‌పేట మాజీ ఎమ్మార్వో సుజాత మృతి చెందారు. శుక్రవారం సాయంత్రం గుండెపోటుతో నిమ్స్ ఆసుపత్రిలో చేరిన సుజాత శనివారం ప్రాణాలు విడిచారు. సుజాత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాగా ఆదాయానికి మించి ఆస్తులున్న కేసులో గతంలో సుజాత ఇంటిపై దాడి చేసిన ఏసీబీ అధికారులు.. ఆమెను అరెస్ట్ చేశారు.
రెండేళ్ల క్రితం బంజారాహిల్స్‌లోని ఓ స్థలం వ్యవహరంలో 15 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ షేక్‌పేట ఆర్ఐ నాగార్జున పట్టుబడిన కేసులో ఎమ్మార్వో సుజాత హస్తముందని అవినీతి నిరోధక శాఖ తేల్చింది. ఆమె ఇంట్లో అనిశా చేసిన సోదాల్లో భారీగా నగదు లభ్యమైంది. నగదు విషయంలో ఎమ్మార్వో సుజాతను మూడ్రోజుల పాటు ఏసీబీ అధికారులు విచారించారు.ఆమెతో పాటు భర్త అజయ్‌ను అవినీతి నిరోధక శాఖ అధికారులు ప్రశ్నించారు. భూముల విషయంలో ఎమ్మార్వో ప్రమేయమున్నట్లు ప్రాథమిక నిర్ధరణ కావటంతో ఆమెను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఈ వ్యవహారంలో అజయ్ ఏసీబీ అధికారుల విచారణకు హాజరుకావాల్సిన రోజే ఆత్మహత్య చేసుకున్నారు. ఓ విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా పనిచేసే అజయ్ అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నారు. భర్త ఆత్మహత్య, కేసులు, సస్పెన్షన్లతో సుజాత అనారోగ్యానికి గురయ్యారు.
ఎమ్మార్వో సుజాత మృతిని వైద్యులు ధృవీకరించారు. గత వారం క్రితం అనారోగ్యానికి గురి కావడంతో కుటుంబ సభ్యులు నిమ్స్‌కు తీసుకు వచ్చినట్లు తెలిపారు. మరోవైపు సుజాతకు క్యాన్సర్ కూడా ఉందని వైద్యులు పేర్కొన్నారు. అదే సమయంలో డెంగీ కూడా సోకడంతో వైద్యులు ట్రీట్‌మెంట్ మొదలు పెట్టారు. అయితే చికిత్స కొనసాగుతూ ఉండగానే ఈ ఉదయం గుండెపోటుతో సుజాత మృతి చెందినట్లు తెలిపారు
Follow Us on Facebook : https://www.facebook.com/telugooduNews
Go to Home page : https://telugoodu.net/