జాతీయం ముఖ్యాంశాలు

స్విస్ బ్యాంకుల్లో 20 వేల కోట్ల న‌ల్ల‌ధ‌నం.. ఖండించిన కేంద్ర ఆర్థిక‌మంత్రిత్వ‌శాఖ‌

స్విస్ బ్యాంకుల్లో భార‌తీయులు దాచిన న‌ల్ల‌ధ‌నం గ‌త ఏడాది సుమారు 20 వేల కోట్లకు పెరిగిన‌ట్లు వ‌చ్చిన వార్త‌ల‌ను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ‌శాఖ ఖండించింది. భార‌తీయులు స్విస్ బ్యాంకుల్లో గ‌త 13 ఏళ్ల‌తో పోలిస్తే రికార్డు స్థాయిలో డిపాజిట్లు చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఆ ఆరోప‌ణ‌ల‌ను కూడా కేంద్రం ఖండించింది. 2019లో 6625 కోట్లుగా ఉన్న భార‌తీయుల నిధులు.. గ‌త ఏడాది అమాంతంగా 20 వేల కోట్లకు చేరిన‌ట్లు ఓ మీడియా క‌థ‌నం పేర్కొన్న‌ది. ఆ వార్త‌ను కేంద్ర ఆర్థిక మంత్రి కార్యాల‌యం ఖండించింది. స్విస్ నేష‌న‌ల్ బ్యాంక్‌కు వివిధ స్విస్ బ్యాంకులు స‌మ‌ర్పించిన మొత్తం ఫిగ‌ర్‌ను త‌ప్పుగా చిత్రీక‌రించిన‌ట్లు ఆర్థిక శాఖ వెల్ల‌డించింది. అది కేవ‌లం స్విట్జ‌ర్లాండ్‌లో దాచుకున్న భార‌తీయుల సొమ్ము కాదు అన్న‌ది. 2019 నుంచి స్విస్ బ్యాంకుల్లో డిపాజిట్లు త‌గ్గిన‌ట్లు కేంద్ర ఆర్థిక శాఖ చెప్పింది. అయితే స్విస్ బ్యాంకుల నుంచి భార‌తీయ క‌స్ట‌మ‌ర్ల వివ‌రాల‌ను సేక‌రిస్తున్న‌ట్లు ఆర్థిక మంత్రిత్వ‌శాఖ కార్యాల‌యం పేర్కొన్న‌ది. డిపాజిట్లు స‌గం త‌గ్గిన‌ట్లు చెప్పిన ప్ర‌భుత్వం.. ఎంత అమౌంట్ అన్న విష‌యాన్ని స్ప‌ష్టం చేయ‌లేదు.