ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నదిలోకి టూరిస్ట్ కారు దూసుకెళ్లడం తో 9 మంది మృతి చెందారు. గత కొద్దీ రోజులుగా ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు పడుతుండడం తో రామ్‌నగర్‌లోని ధేలా నది పొంగి ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం.. పర్యటకులతో వెళ్తున్న ఓ కారు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందారు. నదీ ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఓ బాలికను స్థానికులు కాపాడారు. సమాచారం తెలుసుకున్న జిల్లా అధికారులు.. ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కారులో చిక్కుకుపోయిన మృతదేహాలను వెలికితీశారు. మృతుల్లో స్థానికంగా నివసిస్తున్న కొంతమందితో పాటు పంజాబ్‌కు చెందిన పర్యటకులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు అధికారులు చెప్పుకొచ్చారు.
ఈ ప్రమాదానికి ‘అతివేగమే కారణం’ అని అంటున్నారు. మృతుల్లో ఆరుగురు మహిళలు ఉన్నట్లు తెలిపారు. మొత్తం 11 మంది ప్రయాణికుల్లో ఇద్దరు మాత్రమే ప్రాణాలతో బతికి బయటపడ్డారు. మిగతా 9 మందీ చనిపోయినట్టు అధికారులు నిర్ధారించారు. కార్బెట్ జాతీయ పార్కులోని ధేలా జోన్‌లో ఈ ఘటన జరిగింది. వేగంగా దూసుకెళ్తున్న కారును ఆపేందుకు అక్కడి స్థానికులు ప్రయత్నించినా ఆగకుండా వెళ్లిపోయారని పేర్కొన్నారు. అలా వెళ్లిన కారు ధేలా గ్రామంలోని నదిలో బలమైన ప్రవాహం కారణంగా కొట్టుకుపోయినట్టు తెలిపారు. కాగా, ఇక్కడ గతంలోనూ పలుమార్లు ప్రమాదాలు జరిగాయి. దీంతో నదిపై వంతెన నిర్మించాలన్న చర్చలు జరుగుతున్నాయి.
Follow Us on Facebook : https://www.facebook.com/telugooduNews
Go to Home page : https://telugoodu.net/