దేశంలో ఇంధన ధరలు భగ్గుమంటున్నాయి. గత కొద్దిరోజులుగా వరుసగా ధరలను పెంచుతూ చమురు కంపెనీలు సామాన్యులకు చుక్కలు చూపుతున్నాయి. తాజాగా.. ఒక రోజు విరామం తర్వాత ఆదివారం ధరలు మళ్లీ పైకి కదిలాయి. లీటర్ పెట్రోల్‌పై 30, డీజిల్‌పై 31 పైసలు పెంచాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.97.22, డీజిల్ ధర రూ.87.97కు చేరింది. దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో లీటర్ పెట్రోల్ రూ.103.36, డీజిల్ రూ.95.44కు పెరిగింది.
ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఏడు, ఎనిమిది రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.100 దాటింది. దేశంలో అత్యధిక ధర రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో పెట్రోల్ రూ.108.37కు చేరగా.. డీజిల్ ధర రూ.101.12కు చేరింది. గత నెల మేలో ఇంధన ధరలను 16 సార్లు సవరించగా.. జూన్‌లో ఇప్పటి వరకు 12 సార్లు పెరిగాయి. గత నెలలో ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు విడుదలైన అనంతరం ధరలు పైకి కదులుతూ వస్తున్నాయి.