- ఏపీ జల చౌర్యంకేంద్రం చోద్యం తెలంగాణ సమరం
- అలంపూర్ వద్ద నిర్మాణం
- జోగులాంబ బరాజ్
- సుంకేశుల పరీవాహంలో మరో లిఫ్ట్
- భీమా ప్రవేశ ప్రాంతంలో వరదకాల్వ
- పులిచింతలకు ఎడమ కాల్వ నిర్మాణం
- సాగర్ టెయిల్ పాండ్ వద్ద ఇంకో ఎత్తిపోతల
గోదావరిపై సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తిచేసిన తెలంగాణ ప్రభుత్వం.. ఇక కృష్ణా నదీజలాల వినియోగంపై దృష్టి సారించింది. కరువుపీడిత ప్రాంతాలైన మహబూబ్‌నగర్.. తదితర జిల్లాల్లో శాశ్వతంగా నీటి సమస్య పరిష్కారం కోసం కృష్ణా, భీమా నదులపై ఎత్తిపోతల ప్రాజెక్టులకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అలంపూర్ వద్ద కృష్ణానదిపై జోగులాంబ బరాజ్ కట్టాలని నిర్ణయించింది. కృష్ణానదీ జలాల వినియోగంలో రాష్ర్టానికి దక్కాల్సిన వాటాను దక్కనీయకుండా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచేస్తున్న జలదోపిడీపై పోరాడాలని తీర్మానించింది. తెలంగాణ రైతుల ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఎంతదూరమైనా పోవాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది.
ఏపీ జల దోపిడీపై యుద్ధం
- అక్రమంగా రాయలసీమ లిఫ్ట్.. ఆర్డీఎస్ కుడికాల్వ నిర్మాణాలు
- ఎన్జీటీ, కేంద్రం ఆదేశాల బేపర్వా.. కేంద్ర సర్కారు నిష్క్రియాపరత్వం
- ఏపీ, కేంద్ర ప్రభుత్వ వైఖరులతో తెలంగాణ రాష్ర్టానికి తీరని నష్టం
- మంత్రిమండలి తీవ్ర నిరసన.. కృష్ణాజలాల్లో వాటాకు కార్యాచరణ
కేంద్రం నిష్రియాపరత్వం వల్ల తెలంగాణ రైతుల ప్రయోజనాలకు భంగం కలిగే పరిస్థితి ఏర్పడింది. కొత్తగా ఒక రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఆ రాష్ట్రం కుదురుకోవడానికి కేంద్రం కొన్ని ప్రత్యేక చర్యలు చేపట్టి, సహకారం అందించాల్సి ఉంటుంది. అటువంటి చొరవ తీసుకోకుండా, బాధ్యత వహించకుండా నదీ జలాల విషయంలో అవలంబిస్తున్న కేంద్ర నిర్లక్ష్య వైఖరి సరికాదు. తెలంగాణ రైతాంగ ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఎంత దూరమైనా పోవడానికి సిద్ధం.
కృష్ణా జలాల్లో రాష్ర్టానికి న్యాయంగా దక్కాల్సిన వాటాను సక్రమంగా, సంపూర్ణంగా వినియోగించుకొని తెలంగాణ రైతాంగ ప్రయోజనాలను కాపాడటంకోసం ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకొన్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో శనివారం జరిగిన సమావేశంలో కృష్ణానదిపై ఏపీ అక్రమంగా కడుతున్న ప్రాజెక్టులపై క్యాబినెట్ సుదీర్ఘంగా చర్చించింది. కృష్ణానదిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న జలదోపిడీని ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకోవాలని నిశ్చయించింది. అదే సమయంలో కృష్ణానదిపై అవసరమైన మేర ఎత్తిపోతల ప్రాజెక్టులు నిర్మించాలని నిర్ణయించింది. జోగులాంబ గద్వాల, వనపర్తి జిల్లాల మధ్యన కృష్ణానదిపై జోగులాంబ ఆనకట్టను నిర్మించాలన్న ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. దీంతోపాటు పులిచింతలకు ఎడమ కాల్వ నిర్మాణం చేయాలని, సుంకేశుల పరీవాహంలో ఇంకో లిఫ్ట్ చేపట్టాలని, భీమా నదికి వరద కాల్వ నిర్మాణంతోపాటు, నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్ దగ్గర ఇంకో ఎత్తిపోతల నిర్మాణానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కల్వకుర్తి ఎత్తిపోతలలో జలాశయాల సామర్థ్యాన్ని 20 టీఎంసీలకు పెంచాలని కూడా క్యాబినెట్ తీర్మానం చేసింది.
ఆంధ్రప్రదేశ్ జలదోపిడీపై సమరం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న జలదోపిడీని ఎట్టిపరిస్థితుల్లోనూ అడ్డుకోవాలని క్యాబినెట్ నిర్ణయించింది. కృష్ణానదిపై ఏపీ అక్రమంగా చేపడుతున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం, రాజోలిబండ (ఆర్డీఎస్) కుడికాలువ నిర్మాణాలను తీవ్రంగా నిరసించింది. తెలంగాణ ఎంత సహకరిస్తున్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం నిష్రియాపరత్వం వల్ల రాష్ట్ర రైతుల ప్రయోజనాలకు భంగం కలిగే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నది. ఏపీ అక్రమ ప్రాజెక్టులతో పాలమూరు, నల్లగొండ, ఖమ్మం, వరంగల్, రంగారెడ్డి జిల్లాలకు సాగునీరు, హైదరాబాద్‌కు తాగునీరు విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తంచేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రైతాంగ ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఎంత దూరమైనా పోవాలని క్యాబినెట్ అభిప్రాయపడింది. ప్రత్యేక కార్యాచరణ నిర్ణయించింది. అదే సమయంలో కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయంగా రావాల్సిన వాటాను దక్కించుకొనేందుకు మంత్రిమండలి పలు నిర్ణయాలు తీసుకొన్నది.
నదీజలాల విషయంలో కేంద్రం అలసత్వం
ఏపీ ప్రభుత్వం అక్రమంగా చేపడుతున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం, రాజోలిబండ (ఆర్డీఎస్) కుడి కాలువ నిర్మాణాలను క్యాబినెట్ తీవ్రంగా నిరసించింది. ఏపీ అక్రమ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌ను (ఎన్జీటీ) ఆశ్రయించిందని, సుప్రీంకోర్టులో కూడా కేసులు వేసిందని నీటిపారుదలశాఖ అధికారులు క్యాబినెట్‌కు తెలిపారు. ఎన్జీటీతోపాటు కేంద్రం ఆదేశించినా ఆ ఆదేశాలను ఏపీ సర్కారు బేఖాతరు చేయడాన్ని క్యాబినెట్ తీవ్రంగా ఖండించింది. బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ఏర్పడి 17 ఏండ్లయినా, తెలంగాణ ఏర్పడి ఇన్నేండ్లయినా తెలంగాణకు కృష్ణా జలాల్లో న్యాయమైన నీటి వాటా నిర్ధారణ కాలేదు. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం అంతర్రాష్ట్ర నదీజలాల వివాద చట్టం-1956లోని సెక్షన్-3 ప్రకారం ట్రిబ్యునల్‌ను ఏర్పాటుచేయాలని కేంద్రానికి విజ్జప్తిచేసింది. సుప్రీంకోర్టులో కేసు కారణంగా తాము ట్రిబ్యునల్‌ను ఏర్పాటుచేయలేకపోతున్నామని, కేసులను తెలంగాణ విరమించుకొంటే త్వరగా నిర్ణయిస్తామని కేంద్ర జలశక్తిశాఖ మంత్రి అపెక్స్ కౌన్సిల్ రెండో సమావేశంలో (అక్టోబర్ 6, 2020) స్పష్టమైన హామీ ఇచ్చారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసును విరమించుకొని కేంద్రానికి లేఖ రాసింది. సమస్యను కేంద్రం సామరస్యపూర్వకంగా పరిషరిస్తుందనే నమ్మకంతోనే కేసును ఉపసంహరించుకొన్న తరువాత కూడా కేంద్రం నిష్రియాపరత్వం వల్ల తెలంగాణ రైతుల ప్రయోజనాలకు భంగం కలిగే పరిస్థితి ఏర్పడింది. కొత్తగా ఒక రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఆ రాష్ట్రం కుదురుకోవడానికి కేంద్రం కొన్ని ప్రత్యేక చర్యలు చేపట్టి, సహకారం అందించాల్సి వుంటుందని, అటువంటి చొరవ తీసుకోకుండా, బాధ్యత వహించకుండా నదీ జలాల విషయంలో అవలంభిస్తున్న, కేంద్రనిర్లక్ష్య వైఖరి పట్ల రాష్ట్ర క్యాబినెట్ ఆవేదన వ్యక్తంచేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రైతాంగ ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఎంత దూరమైనా పోవాలని క్యాబినెట్ అభిప్రాయపడింది.
ప్రత్యేక కార్యాచరణ
ఈ పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణకు కృష్ణా జలాలపై హకులను పరిరక్షించుకొని తెలంగాణ రైతులను, వ్యవసాయాన్ని కాపాడుకోవడానికి కార్యాచరణ నిర్ణయించింది. ఈ విషయంలో ప్రధానమంత్రిని, కేంద్రజల్‌శక్తిమంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించి, ఈ అక్రమ ప్రాజెక్టులను ఆపించేవిధంగా చూడాలని తీర్మానించింది. ప్రజా క్షేత్రంలో, న్యాయస్థానాల్లో, ఆంధ్రప్రదేశ్ జలదోపిడీని ఎత్తిచూపి, రాబోయే వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లో గళం విప్పి, జాతికి వివరించాలన్న అభిప్రాయమూ వ్యక్తమైంది. ఆంధ్రప్రదేశ్ అక్రమ ప్రాజెక్టుల పర్యవసానంగా కృష్ణా బేసిన్ ప్రాంతాలకు సాగునీటి రంగంలో జరుగబోయే తీవ్ర నష్టాన్ని పెద్ద ఎత్తున ప్రచారంచేస్తూ ప్రజల్లోకి తీసుకుపోవాలని నిర్ణయించింది.
ఎత్తిపోతల విద్యుత్ ఖర్చు ఆదా
వానకాలంలోనే నదీ జలాల లభ్యత ఎకువగా ఉండటంతో జలవిద్యుత్తు ఉత్పత్తికి అనుకూలత ఏర్పడుతుందని క్యాబినెట్ చర్చించింది. వానకాలం ప్రారంభంలోనే కాళేశ్వరం వంటి ఎత్తిపోతల పథకాలకు నీటి ప్రవాహం పెరుగుతుంది కాబట్టి, ఎప్పటి జలాలను అప్పుడే ఎత్తిపోసుకొనే వీలుంటుందని, ఈ నేపథ్యంలో తెలంగాణకు హకుగా ఉన్న జల విద్యుత్తు ప్రాజెక్టుల ద్వారా విద్యుత్తును వానకాలం సీజన్‌లోనే వీలయినంత సామర్థ్యంమేరకు ఉత్పత్తిచేసి ఎత్తిపోతల పథకాలకు వినియోగించుకోవాలని, తద్వారా ఎత్తిపోతల పథకాలకయ్యే విద్యుత్తు ఖర్చును తగ్గించుకోగలుగుతామని క్యాబినెట్ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో కృష్ణా, గోదావరి నదులపై 2,375 మెగావాట్ల జల విద్యుత్తును ఉత్పత్తి చేయగలిన ప్రాజెక్టులు ఉన్నాయని, వాటి సంపూర్ణ సామర్థ్యంతో జల విద్యుత్తును ఉత్పత్తిచేసి, రాష్ట్రంలోని కాళేశ్వరం, దేవాదుల, ఏఎంఆర్పీ తదితర లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలకు నిరంతర విద్యుత్తును సరఫరాచేయాలని విద్యుత్తుశాఖను క్యాబినెట్ ఆదేశించింది.
సముద్రమట్టానికి 840 అడుగుల ఎత్తున
ప్రతిపాదిత బరాజ్‌ను కృష్ణానదిపై జూరాలకు దిగువన జోగులాంబ గద్వాల-వనపర్తి జిల్లాల మధ్య నిర్మిస్తారు. ఇది వనపర్తి జిల్లా పరిధిలోకి వస్తుంది. సముద్రమట్టానికి 840 అడుగుల ఎత్తులో బరాజ్ నిర్మాణం ప్రారంభంకానున్నది. దాదాపు 59 అడుగుల ఎత్తువరకు ఆనకట్టను నిర్మిస్తారు. దాదాపు 3.82 కిలోమీటర్ల పొడవున ఉండే ఈ బరాజ్‌లో 55.3 టీఎంసీలు నిల్వచేసే అవకాశం కలుగనున్నది.
- శ్రీశైలం ప్రాజెక్టు ఎఫ్‌ఆర్‌ఎల్- 885 అడుగులు (269.75 మీటర్లు)
- గరిష్ఠ నీటి నిల్వ స్థాయి – 892 అడుగులు (271.88 మీటర్లు)
- బరాజ్ ప్రతిపాదిత ప్రాంతం ఎత్తు – 840 అడుగులు (256 మీటర్లు)
- బరాజ్ గరిష్ఠ ఎత్తు – 899 అడుగులు (274 మీటర్లు)
- బరాజ్ పొడవు – 3.82 కిలోమీటర్లు (దాదాపు)
- సామర్థ్యం – 55.3 టీఎంసీలు
వాటా దక్కించుకొనేందుకు కీలక నిర్ణయాలు
ఏపీ ప్రభుత్వం తలపెట్టిన అక్రమ ప్రాజెక్టుల వల్ల పాలమూరు, నల్లగొండ, ఖమ్మం, వరంగల్, రంగారెడ్డి జిల్లాలకు సాగునీరు, హైదరాబాద్‌కు తాగునీరు విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతున్నది. న్యాయంగా దకాల్సిన కృష్ణా నీటి వాటాను దకించుకోవడానికి రాష్ట్ర మంత్రిమండలి చర్చించి పలు నిర్ణయాలు తీసుకొన్నది.
- జోగులాంబ గద్వాల, వనపర్తి జిల్లాల మధ్య కృష్ణానదిపై అలంపూర్ వద్ద.. గుమ్మడం, గొందిమల్ల, వెలటూరు, పెద్ద మారూరు గ్రామాల పరిధిలో కొత్త బరాజ్ (జోగులాంబ)ను నిర్మించి 60-70 టీఎంసీల వరదనీటిని పైపులైన్ ద్వారా తరలించాలని నిర్ణయించింది. తద్వారా.. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అంతర్భాగమైన ఏదుల రిజర్వాయర్‌కు నీటిని ఎత్తిపోసి, పాలమూరు, కల్వకుర్తి ప్రాజెక్టుల ఆయకట్టు అవసరాలను తీర్చాలని తీర్మానించింది. కృష్ణా, తుంగభద్ర సంగమానికి దాదాపు కిలోమీటర్ ఎగువన ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపడతారు. దీనివల్ల తెలంగాణ హక్కులకు భంగం వాటిల్లేలా ఆర్డీస్ కుడికాల్వ పనులు, రాయలసీమ ఎత్తిపోతల పనులను ప్రారంభించిన ఏపీ కుట్రలకు చెక్ పెట్టినట్టవుతుంది. ఈ ఆనకట్ట పొడవు దాదాపు నాలుగు కిలోమీటర్ల పొడవు ఉంటుంది.
- పులిచింతల ఎడమ కాల్వను నిర్మించి నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని నిర్ణయించింది.
- సుంకేశుల పరీవాహం నుంచి మరొక ఎత్తిపోతల ద్వారా నడిగడ్డ ప్రాంతానికి మరో లక్ష ఎకరాల మేర సాగునీటిని అందించాలని తీర్మానించింది.
- కృష్ణా ఉపనది అయిన భీమా తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశించే ప్రాంతమైన కృష్ణ మండలంలోని కుసుమర్తి గ్రామం వద్ద.. భీమా వరద కాల్వను నిర్మించాలని క్యాబినెట్ నిర్ణయించింది.
- కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో జలాశయాల నిల్వ సామర్థ్యాన్ని 20 టీఎంసీలకు పెంచాలని తీర్మానించింది.
- నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్ నుంచి ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి, నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలోని రెండు లక్షల ఎకరాల ఎగువ భూములకు, సాగునీటి సౌకర్యం కల్పించాలని నిర్ణయించారు.
- ఈ ప్రాజెక్టులకు సర్వేలు నిర్వహించి,
- డీపీఆర్‌ల తయారీకి వెంటనే చర్యలు తీసుకోవాలని సాగునీటిశాఖను క్యాబినెట్ ఆదేశించింది.