జాతీయం ముఖ్యాంశాలు

రాష్ట్రపతి అభ్యర్థి మద్దతు విషయంలో ఏది సరైనదని అనిపిస్తే అదే చేస్తాం

రాష్ట్రపతి అభ్యర్థి ఎన్డీయే ద్రౌపది ముర్ము కు మద్దతివ్వాలని శివసేన ఎంపీలు ఆ పార్టీ చీఫ్ ఉద్ధవ్ థాకరే‌కు విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో దానిపై సానుకూల సంకేతాలు పార్టీ నుంచి వెలువడుతున్నాయి. దీనిపై మీడియాతో శివసేన ప్రతినిధి సంజయ్ రౌత్ ఈరోజు మాట్లాడుతూ.. మద్దతు విషయంలో ఏది సరైనదని అనిపిస్తే అది శివసేన చేస్తుందని చెప్పారు. గతంలో కూడా కాంగ్రెస్ అభ్యర్థి టీఎన్ శేషన్‌కు, యూపీఏ అభ్యర్థులు ప్రతిభా పాటిల్, ప్రణబ్ ముఖర్జీకి మద్దతు ప్రకటించామని అన్నారు. రాజకీయాలకు అతీతంగా వ్యవహరించడం శివసేన సాంప్రదాయమని చెప్పారు. జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగానే ఆయా అభ్యర్థులకు తమ మద్దతు ఉంటుందని అన్నారు.

ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ఇచ్చేందుకు శివసేన సన్నద్ధంగా ఉందా అని సూటిగా ప్రశ్నించినప్పుడు, దీనిపై పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోవచ్చని రౌత్ తెలిపారు. రాష్ట్రపతి పదవిని చేపట్టే తొలి గిరిజన మహిళ ద్రౌపది ముర్ము కావచ్చని, మహారాష్ట్రలో చాలా మంది గిరిజనులు ఉన్నారని, శివసైనికులు కూడా చాలా మంది గిరిజన ప్రాంతాల నుంచి వచ్చిన వారే కాక, గిరిజన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని ఆయన తెలిపారు. ద్రౌపది ముర్ముకు మద్దతివ్వాలని నిర్ణయిస్తే దాని అర్ధం బీజేపీకి మద్దతివ్వడం మాత్రం కాదని ఆయన వివరణ ఇచ్చారు. ఒత్తిళ్లకు లొంగి ఉద్ధవ్ థాకరే నిర్ణయాలు తీసుకోరని, ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా తమ అందరికీ ఆమోదయోగ్యమేనని చెప్పారు. కాగా, ఈనెల 18న రాష్ట్రపతి ఎన్నికలు జరుగనున్నారు.

Follow Us on Facebook : https://www.facebook.com/telugooduNews

Go to Home page : https://telugoodu.net/