ఇకపై పార్లమెంట్ ఆవరణలో ధర్నాలు, నిరసనలు, దీక్షలు, మతపరమైన కార్యక్రమాలను అనుమతించడం లేదు. దీనికి సంబంధించిన సర్క్యూలర్‌ను రాజ్యసభ సెక్రటరీ జారీ చేశారు. జూలై 18 నుంచి వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. రాజ్యసభ కార్యదర్శి జనరల్ పీసీ మోడీ ఈ కొత్త ఆదేశాలను ఓ బులెటిన్‌లో తెలిపారు. సభ్యులందరూ సహకరించాలని ఆయన కోరారు. రాజ్యసభ కార్యదర్శి తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ ఖండించారు. విశ్వగురు కొత్త నాటకమని, ధర్నా మనా హై అంటూ జైరాం తన ట్విట్టర్‌లో ఆరోపించారు.
గతంలో విపక్షాలు పార్లమెంట్ కాంప్లెక్స్ లోపల, గాంధీ విగ్రహం ముందు నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. కొన్ని పదాలను పార్లమెంట్‌లో వాడరాదని వచ్చిన వార్తలను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కొట్టిపారేసిన విషయం తెలిసిందే. కానీ ఆయా పదాలను అవసరాన్ని బట్టి రికార్డుల నుంచి తొలగిస్తామన్నారు. జుమ్లాజీవి, బాల్ బుద్ది, కోవిడ్ స్ప్రెడ్డర్, స్నూప్‌గేట్, అషేమ్డ్, అబ్యూజ్డ్, బెట్రేడ్, కరప్ట్, డ్రామా, హిపోక్రసీ, ఇన్‌కాంపిటెంట్ లాంటి పదాల్ని సభలో వాడరాదని ఇటీవల లోక్‌సభ సెక్రటేరియేట్ ఓ బుక్‌లెట్‌ను రిలీజ్ చేసింది. అయితే అలాంటిది ఏమీ లేదని ఓం బిర్లా పేర్కొన్నారు.
Follow Us on Facebook : https://www.facebook.com/telugooduNews
Go to Home page : https://telugoodu.net/