ఇప్పుడు వెళ్లి హ్యాపీగా సినిమా చూసుకో..ప్రధాని మోడి
ప్రధాని మోడి: కామన్వెల్త్ గేమ్స్-2022 లో భారత వెయిట్ లిఫ్టర్ల అద్భుత ప్రదర్శన కొనసాగుతోంది . ఇప్పటికే రెండు రోజుల్లో ఐదు పతకాలు సాధించిన వెయిట్ లిఫ్టర్లు మరో పతకాన్ని భారత్ ఖాతాలో చేర్చారు. తాజాగా పురుషుల 73 కేజీల ఫైనల్లో అచింత షూలి పసిడి సాధించాడు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ముగిసిన ఈ పోటీలో ఆరంభం నుంచి స్థిరంగా బరువులు ఎత్తిన 20 ఏళ్ల ఈ బెంగాల్ లిఫ్టర్ ప్రత్యర్థుల నుంచి పోటీ ఎదురైనా వారిని వెనక్కి నెట్టి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. బంగారు పతకాన్ని సాధించిన అచింతను పలువురు ప్రముఖులు అభినందిస్తున్నారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కంగ్రాట్స్ చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ‘అనుకున్నది సాధించావుగా.. ఇప్పుడు వెళ్లి హ్యాపీగా సినిమా చూసుకో’ అంటూ ట్వీట్ చేశారు మోడీ.
కామన్వెల్త్ క్రీడలకు ముందు ఆటగాళ్లతో మోడీ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఆ సమయంలో అచింతతో జరిగిన సంభాషణను మోదీ గుర్తుచేసుకున్నారు. “కామన్వెల్త్ గేమ్స్‌కు ఆటగాళ్ల బృందంతో మాట్లాడాను. ఆ సమయంలో అచింతతో కూడా సంభాషించాను. అతడికి తన తల్లి, సోదరుడు ఇచ్చిన మద్దతు గురించి చర్చించాము. అతడికి సినిమాలు ఇష్టమని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు అచింతకు సమయం దొరికింది. సినిమాలు చూసుకోవచ్చు” అని మోడీ ట్వీట్ చేశారు.
కాగా, పతకం గెలుచుకున్న అనంతరం అచింత మీడియాతో మాట్లాడాడు. “నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎన్నో పోరాటాలను అధిగమించి ఈ పతకాన్ని సాధించాను. ఈ బంగారు పతకాన్ని నా సోదరుడితో పాటు కోచ్‌లకు అంకితం చేస్తాను. ఇక నా టార్గెట్ ఒలింపిక్స్. అందుకు ప్రాక్టీస్ మొదలుపెడతాను” అని అచింత చెప్పాడు.
Follow Us on Facebook : https://www.facebook.com/telugooduNews
Go to Home page : https://telugoodu.net/