తెలంగాణ

కోమటిరెడ్డి బీజేపీలో చేరేది ఆరోజే: ‘వెంకటరెడ్డి మంచి నిర్ణయం, రేవంత్ చిల్లరదొంగ’

హైదరాబాద్: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మార్పు ఖరారైపోయింది. గురువారం కాంగ్రెస్ పార్టీకి ఆయన రాజీనామా చేసిన విషయం తెలిసిందే. పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి రాజీనామా లేఖను పంపారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఢిల్లీలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హోంమంత్రి అమిత్ షాను కలిశారు.

అమిత్ షా సమక్షంలో 21న బీజేపీలోకి రాజగోపాల్ రెడ్డి అనంతరం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తనను బీజేపీలోకి కేంద్రమంత్రి అమిత్ షా ఆహ్వానించారని తెలిపారు. త్వరలోనే బీజేపీలో చేరుతున్నట్లు చెప్పారు. ఆగస్టు 21న అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారని, అదే సమయంలో ఆయన సమక్షంలో కాషాయ పార్టీలో చేరుతున్నట్లు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.

చిల్లర దొంగ పీసీసీ చీఫ్ అయ్యారంటూ రేవంత్‌పై ఫైర్ ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చిల్లర దొంగ పీసీసీ చీఫ్ అయ్యారని దుయ్యబట్టారు. ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు రేవంత్ నాయకత్వంలో సంతోషంగా లేరన్నారు. రానున్న రోజుల్లో మంచి నాయకులంతా కాంగ్రెస్ పార్టీని వీడతారని కోమటిరెడ్డి అన్నారు.

కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంచి నిర్ణయం తీసుకుంటారన్న రాజగోపాల్ కాంగ్రెస్ ఎంపీ, తన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా మంచి నిర్ణయం త్వరలోనే తీసుకుంటారని అనుకుంటున్నట్లు తెలిపారు. కోమటిరెడ్డి బ్రదర్స్ పై వాడరాని భాష ఉపయోగించి రేవంత్ రెడ్డి పెద్ద తప్పు చేశారని అన్నారు. రేవంత్ రెడ్డి.. తాను బీజేపీకి అమ్ముడుపోయినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు. నిరూపించకుంటే నువ్వు రాజీనామా చేస్తావా? అంటూ రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.