భారత సంతతికి చెందిన ప్రఖ్యాత బ్రిటిష్ రచయిత సల్మాన్ రష్డీ (75)పై శుక్రవారం అమెరికాలో హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. న్యూయార్క్ లో భావ ప్రకటన స్వేచ్ఛపై ప్రసంగించేందుకు వెళ్లిన సల్మాన్ రష్దీ పై దుండగుడు కత్తితో దాడి చేశాడు. వేదికపైకి ఎక్కి ప్రసంగించేందుకు సిద్ధమవుతున్న తరుణంలో హఠాత్తుగా వేదికపైకి వచ్చిన వ్యక్తి సల్మాన్ పై 10సార్లకుపైగా కత్తితో పొడిచినట్టు ప్రత్యక్ష సాక్షులు చెప్పుకొచ్చారు. కత్తిపోట్లకు గురైన సల్మాన్ రష్డీ స్టేజిపైనే కుప్పకూలిపోయాడు. సల్మాన్ రష్దిని వెంటనే హెలికాఫ్టర్ లో హాస్పిటల్ కు తరలించారు. రష్డీపై దాడి చేసిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 75 ఏళ్ల రష్డీ ప్రస్తుతం వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు. ఆయనపై దుండగుడు విచక్షణా రహితంగా కత్తితో పొడవడంతో ఆయన పరిస్థితిపై ఏమీ చెప్పలేమని వైద్యులు చెబుతున్నారు. అయితే ఓ కన్ను పోయే అవకాశం ఉందని అంటున్నారు.
వివాదాస్పద రచయితగా పేరుపడ్డ రష్దీ 1947 జూన్ 19న ముంబైలో జన్మించారు. పూర్తి పేరు అహ్మద్ సల్మాన్ రష్దీ. రచయితగా అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. చారిత్రక విషయాలతో పాటు వర్తమాన అంశాలకు ఆత్మాశ్రయ శైలిలో మనసుకు హత్తుకునేలా అక్షర రూపమివ్వడం ఆయన ప్రత్యేకత. 14 నవలలు, ఓ కథా సంకలనంతో పాటు పలు కాల్పనికేతర రచనలు చేశారు. ఎన్నో సాహిత్య అవార్డులు అందుకున్నారు. బ్రిటిష్ వలస పాలన నుంచి స్వాతంత్య్రం, దేశ విభజన దాకా సాగిన పరిణామాలను చిత్రించిన నవల మిడ్‌నైట్స్ చిల్డ్రన్‌కు 1981లో ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్ లభించింది. అయితే మతాన్ని కించపరిచే రాతలు రాస్తున్నారంటూ 1980ల నుంచే రష్దీని వివాదాలు చుట్టుముట్టాయి. బెదిరింపులు మొదలయ్యాయి.
Follow Us on Facebook : https://www.facebook.com/telugooduNews
Go to Home page : https://telugoodu.net/